నిన్న కాకినాడ వద్ద తీరాన్ని దాటిన వాయుగుండం ఇంకా స్థిరంగానే కొనసాగుతోంది. ప్రస్తుతం ఇది కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణాలపై కొనసాగుతోందని భారత వాతావరణ విభాగం తెలిపింది. భూభాగం పైకి వచ్చినా ఇది ఇంకా బలహీనపడకుండా స్థిరంగానే కొనసాగుతున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం కర్ణాటకలోని గుల్బర్గాకు 80 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయినట్టు ఐఎండీ స్పష్టం చేసింది. పశ్చిమవాయువ్య దిశగా 25 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం కదులుతున్నట్టు వాతావరణశాఖ వెల్లడించింది.
ఈ సాయంత్రానికి క్రమంగా బలహీనపడి అల్పపీడనంగా మారే సూచనలు ఉన్నట్టు ఐఎండీ అంచనా వేస్తోంది. ఇది అల్పపీడనంగా మారిన అనంతరం పశ్చిమ వాయువ్య దిశగానే కదులుతూ అరేబియా సముద్రంపైకి వెళ్లనుందని స్పష్టం చేసింది.16వ తేదీనాటికి అరేబియా సముద్రంపైకి వెళ్లిన అనంతరం మళ్లీ బలపడి వాయుగుండంగా మారనున్నట్టు ఐఎండీ వెల్లడించింది. అనంతరం ఈశాన్య దిశగా కదులుతూ మహారాష్ట్ర-గుజరాత్ కు దక్షిణంగా ఇది తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్టు తెలిపింది.