తెలంగాణలోని నిర్మల్ జిల్లా కడెం మండలం దోస్తునగర్ గ్రామ సమీపంలోని వారధి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మల్ నుంచి మంచిర్యాల వైపు వెళ్తున్న కారు ఉట్నూరు నుంచి కడెం వస్తున్న ద్విచక్ర వాహనాన్ని వేగంగా ఢీకొంది. ద్విచక్ర వాహనం నడుపుతున్న ఉట్నూరు మండలం నిలాగొండికి చెందిన సోయం మాన్కు (28)... కారు ఢీకొట్టిన వేగానికి ఎగిరి చెట్టు కొమ్మకు చిక్కుకున్నాడు.
తీవ్ర గాయాలు కావడంతో అక్కడే మృతిచెందాడు. కారులోని వ్యక్తి వెంటనే అక్కడి నుంచి జారుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.