అన్నిరంగాలతో పాటు కరోనా మహమ్మారి విద్యారంగాన్ని కుదిపివేసింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభమై గాడిలో పడుతున్నప్పటికీ.. విద్యా రంగంలో అనిశ్చితి కొనసాగుతునే ఉంది. తరగతుల్లో వినాల్సిన పాఠాలు.. ఆన్‌లైన్ వేదికల్లోనే వింటున్నారు. ఈ ఆన్‌లైన్ బోధనను ఇంటర్, డిగ్రీలు చదువుతున్న వారే సరిగ్గా అర్థం చేసుకోలేక పోతున్నారు. ఇంకా, ప్రాథమిక విద్యను అభ్యసించే వారి సంగతైతే చెప్పనక్కర్లేదు. అప్పుడప్పుడే ఇంటిని వదిలి.. బడి వాతావరణానికి అలవాటుపడుతున్న వారికి ఈ ఆన్‌లైన్ పాఠాలు అసలు అర్థం కావడం లేదు. కొంచెం ఆర్థికంగా మెరుగ్గా ఉన్న కుటుంబాల్లోని చిన్నారులు ఇంత వరకు చదువుకున్న పాఠాలు మర్చిపోతుంటే.. పేదకుటుంబాల్లోని చిన్నారులు బడినే మర్చిపోయి పనుల్ని వెతుకుంటున్న దుస్థితి నెలకొంది. ఈ పరిస్థితి ఏ ఒక్క ప్రాంతానికో కాదు.. దాదాపు అన్ని దేశాల్లోనూ ఇదే తంతు.
7 కోట్ల మంది చదువు అర్థం చేసుకోవట్లేదు..
ఇదేఅంశంపై.. పేదరిక నిర్మూలనకు కృషి చేసే వన్ క్యాంపెయిన్ సంస్థ అధ్యయనం చేపట్టింది. ఈ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం సాధారణంగానే అతి తక్కువ ఆదాయం కలిగిన దేశాల్లో 10 ఏళ్లలోపు చిన్నారుల్లో 53% మందికి సరిగ్గా చదవడమే రాదు. అలాంటిది.. కరోనా కారణంగా ఈ ప్రభావం 17%పైగా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా 7 కోట్ల మందికి పైగా పిల్లలు.. తమ స్థాయికి తగ్గట్లు చదువు అర్థం చేసుకోవట్లేదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. రాబోయే దశాబ్దకాలంలో ఈ సంఖ్య 70 కోట్లకు చేరుతుందని వన్ క్యాంపెయిన్ సంస్థ నివేదించింది.
71 బీద దేశాల్లో,..
ఈ పరిస్థితులు ఎక్కువగా ఆఫ్రికా, ఆసియా దేశాల్లో కనిపిస్తాయి. ఈ జాబితాలో ఎక్కువగా ప్రభావితం అవుతోంది.. బాలికలే. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంటికే పరిమితమైన బాలికల్లో.. 2 కోట్ల మంది తిరిగి బడి బాట పట్టలేదని వన్ క్యాంపెయన్ అధ్యయనంలో తేలింది. అందులో కొంతమంది పనులకు వెళ్తుండగా.. కొందరు బాల్యవివాహాల బారినపడి వంటింటికే పరిమితమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా 71 బీద దేశాల్లో 30%విద్యార్థులకు కనీస ఇంటర్నెట్ సదుపాయం లేదు. వివిధ కారణాల వల్ల.. అభివృద్ధి చెందుతున్న భారత్ వంటి దేశాల్లోనూ డిజిటల్ విద్య అందరికీ అందట్లేదు. ఈ నేపథ్యంలో ఇంటిపనులతో పాటు పొలం పనులు, పశువులు కాస్తూ.. పిల్లలు జీతగాళ్లవుతున్నారని పేర్కొంది.
జీవితాలు అతలాకుతలం..
ఈ మహమ్మారి దెబ్బకు ప్రాథమిక విద్య కొన్నాళ్లు పాటు దూరమైతే ఏదో అనుకోవచ్చు కానీ, కొందరు బాలికలకు శాశ్వతంగా బడి ముఖం చూపించలేని దుస్థితి తీసుకువచ్చింది. లాక్‌డౌన్ ఆంక్షలతో పూట గడవటమే ఇబ్బందిగా ఉన్న నిరుపేదల జీవితాలు అతలాకుతలం అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆడపిల్లలను పెంచి పోషించటం భారంగా భావిస్తూ.. చాలా మంది బాల్య వివాహాలు చేసినట్లు గుర్తించింది వన్ క్యాంపెయన్. ఎబోలా వ్యాప్తి చెందుతున్న క్రమంలోనూ.. ఆఫ్రికా దేశాల్లో చాలా బాల్యవివాహాలు జరిగి.. ఎందరో విద్యకు దూరమయ్యారని ఈ సంస్థ గుర్తు చేసింది.