విజయవాడ నుంచి విశాఖకు బయల్దేరిన ఆర్టీసీ బస్‌లో సీట్లు ఖాళీ ఉంటే, ఆ బస్ ఏలూరు బస్టాండ్‌కు చేరిన తర్వాతే డ్రైవర్‌ను అడిగి తెలుసుకొని ప్రయాణికుడు ఎక్కాల్సి ఉంటుంది. ఇకపై ప్రయాణిస్తున్న (రన్నింగ్) బస్‌లో సైతం ఎన్ని సీట్లు ఖాళీ ఉన్నాయో చూసుకొని వాటిని యాప్‌లో బుక్ చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది. ముందుగా టికెట్ బుక్ చేసుకున్న బస్‌ను ప్రయాణికుడు అందుకోలేకపోయినా.. అదే రూట్‌లో తర్వాత వచ్చే మరో సర్వీసులోకి మార్చుకునే అవకాశం రానుంది.
ఇలా దాదాపు 12-15 రకాల సేవలను ఒకే యాప్‌లో లభించేలా యూనిఫైడ్ టికెటింగ్ సొల్యూషన్ యాప్ (గతంలో ప్రథమ్)ను ఏపీఎస్‌ఆర్టీసీ సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీలో ఆన్‌లైన్ అడ్వాన్స్ టికెట్ బుకింగ్, బస్ ట్రాకింగ్, పార్శిల్ బుకింగ్‌లకు మూడు వేర్వేరు యాప్‌లున్నాయి. ఇకపై ఈ సేవలన్నీ ఒకే యాప్‌లో లభిస్తాయి. సెంట్రల్ కమాండ్ సెంటర్, ట్రాకింగ్ డివైజులు, సర్వర్, ఈ పోస్ యంత్రాలు తదితరాల కోసం ఈ ప్రాజెక్ట్ మొత్తానికి రూ.70 కోట్ల వరకు వ్యయమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
డిజిటలైజేషన్ ప్రోత్సాహంలో భాగంగా ఈ ప్రాజెక్ట్‌కు కేంద్రం రూ.10-20 కోట్లు సాయం అందించనుంది. వచ్చేనెలలో టెండర్లు పిలవనున్నారు. ఇప్పటికే నాలుగు సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. యాప్ ద్వారా బుక్ అయ్యే ఒక్కో టికెట్‌కు సగటున 15 పైసల చొప్పున టెండరు దక్కించుకునే సంస్థకు కమిషన్‌కు లభించే వీలుందని అంచనా వేస్తున్నారు.