ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వృద్ధురాలి మృతితో విజయవాడలో కలకలం - వృద్ధురాలి మృతితో విజయవాడలో కలకలం

కరోనా వైరస్‌తో మృతిచెందిన ఓ వృద్ధురాలి ఉదంతం.... ఇప్పుడు విజయవాడలో కలకలం రేపుతోంది. సాధారణ మరణంగా భావించి.... ఆమె అంత్యక్రియల్లో వందలాది మందికి పైగా స్థానికులు పాల్గొన్నారు.

old woman death due to corona in vijayawada
old woman death due to corona in vijayawada

By

Published : Apr 16, 2020, 4:59 AM IST

కరోనాతో మృతిచెందిన ఓ మహిళ అంత్యక్రియల ఘటన విజయవాడ నగరంలో కలకలం రేపుతోంది. సాధారణ మరణంగా భావించి ఆమె అంత్యక్రియల్లో అధికసంఖ్యలో స్థానికులు పాల్గొనడం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం వైద్యారోగ్య సిబ్బంది వారందరినీ గుర్తించి నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

భయాందోళనలో స్థానికులు..

విజయవాడ గాంధీనగర్‌లో ఉండే వృద్ధురాలు గుండె సంబంధిత వ్యాధితో గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 12వ తేదీన మృతి చెందింది. దీంతో కరోనా నిర్ధరణ పరీక్షల కోసం ఆమె నమూనాలు సేకరించి... మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. విజయవాడలోని తమ ఇంటికి మృతదేహాన్ని తీసుకొచ్చి అంత్యక్రియలను నిర్వహించారు. అంత్యక్రియల్లో అధిక సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు. తాజాగా సదరు మహిళకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు అధికారులు కుటుంబసభ్యులకు విషయం తెలియజేయడంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. గాంధీనగర్‌ ప్రాంతం మొత్తం రెడ్ జోన్‌గా ప్రకటించారు. వైద్య సిబ్బంది ఆ మహిళ కుటుంబ సభ్యులతో పాటూ ఇద్దరు పనిమనుషులు, వారి కుటుంబ సభ్యులు పదిమందిని క్వారంటైన్‌కు తరలించారు.

నిర్థరణ పరీక్షలు..

స్థానికంగా ఉన్న వారికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వారందరినీ హోం క్వారంటైన్లో ఉండాలని సూచిస్తున్నారు. అంత్యక్రియల్లో పాల్గొన్న వారందరూ వచ్చి నిర్ధరణ పరీక్షలు నిర్వహించుకోవాలని సూచిస్తున్నారు. ఒక్కొక్కరుగా వెళ్లి నిర్ధరణ పరీక్షలు చేయించుకుంటున్నారు. వీరి ఇంటిలో పనిచేసే పనిమనుషులు మరికొన్ని ఇళ్లలోనూ పనిచేస్తున్నట్టు తెలిసింది. విజయవాడలోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించేందుకు నలుగురు వ్యక్తులు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం వారితో పాటు వారి కుటుంబసభ్యులను గుర్తించి పరీక్షలు నిర్వహించాల్సి ఉంది.

దీనంతటికీ అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ స్థానికులు, మహిళ కుటుంబసభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు ఆసుపత్రిలో రెండుసార్లు కరోనా నిర్థరణ పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ వచ్చిందని చెప్పి మృతదేహాన్ని అప్పగించడం వల్లే విజయవాడకు తీసుకొచ్చామని చెప్తున్నారు. మరోసారి పరీక్ష కోసం నమూనాలను తీసుకున్నప్పుడు మృతదేహాన్ని ఎలా అప్పగించారని ప్రశ్నిస్తున్నారు. నిర్ధరణ పరీక్షల నివేదిక వచ్చేవరకూ మృతదేహాన్ని ఆసుపత్రిలోనే ఉంచి ఉంటే ఇలా అనేకమందికి ముప్పు ఉండేది కాదని..., పూర్తిగా అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇది జరిగిందని మృతురాలి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .

ఇదీ చదవండి:

రాష్ట్రంలో 525కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు

ABOUT THE AUTHOR

...view details