ఆపత్కాలంలో ప్రజారవాణాకు ఓలా క్యాబ్‌లకు అనుమతిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అత్యవసర వైద్య, రవాణా సేవలకు ఓలా క్యాబ్స్ ముందుకొచ్చిందని రవాణాశాఖ వెల్లడించింది. ఓలా సేవలపై రవాణా, పోలీసుశాఖ చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు రవాణాశాఖ అధికారి కృష్ణబాబు తెలిపారు. డయాలసిస్, కేన్సర్, గుండెజబ్బు, తదితర రోగులకు ఓలా సేవలు అందనున్నట్లు వెల్లడించారు. కరోనా లక్షణాలు లేని రోగులకే ఓలా క్యాబ్స్‌లో రవాణాకు అనుమతుంటుందని.. వారి ఇంటి నుంచి ఆస్పత్రికి రాకపోకలకే క్యాబ్‌లు అనుమతిస్తామన్నారు.
ప్రజా రవాణాకు ఓలా క్యాబ్‌లు.. వీరికి మాత్రమే..! - ప్రజారవాణాకు ఓలా క్యాబ్‌లు
అత్యవసర పరిస్థితుల్లో ప్రజారవాణాకు ఓలా క్యాబ్‌లకు ప్రభుత్వం అనుమతిచ్చింది. డయాలసిస్, కేన్సర్, గుండెజబ్బు, తదితర రోగులకు ఓలా సేవలు అందనున్నాయి. కరోనా లక్షణాలున్న రోగులు ఓలా క్యాబ్‌లో ప్రయాణించడానికి అనుమతి లేదు.
![ప్రజా రవాణాకు ఓలా క్యాబ్‌లు.. వీరికి మాత్రమే..! ola cabs for public transport in emergency situation](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6719666-722-6719666-1586440574465.jpg)
కర్ణాటక వైద్యశాఖతో కలసి ఓలా ఈ తరహా సేవలు అందిస్తోందని ఎంటీ కృష్ణబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా విశాఖలో ఓలా క్యాబ్ సేవలందిస్తుందన్నారు. వైద్యులు, పారామెడికల్ సిబ్బంది ఓలా సేవలు వాడుకోవచ్చని తెలిపారు. వైద్యులు, సిబ్బందికి ఇల్లు, ఆస్పత్రి మధ్య రాకపోకలకే అనుమతుందని వెల్లడించారు. ఓలా క్యాబ్‌లో డ్రైవర్ కాకుండా మరో ఇద్దరికే అనుమతుందని.. కారులో భౌతికదూరం, మాస్కులు, శానిటైజర్లు తప్పనిసరని కృష్ణబాబు అన్నారు. నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠినచర్యలు తీసుకుంటామని ఎం.టి.కృష్ణబాబు హెచ్చరించారు.
ఇదీ చదవండి:'మారాలి... మారాలి... మనమంతా మారాలి'
TAGGED:
ప్రజారవాణాకు ఓలా క్యాబ్‌లు