ఇప్పటికే పూర్తికావాల్సిన పది పరీక్షలు లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడుతూ వస్తున్నాయి. ఎప్పుడు నిర్వహించేది ఇంకా స్పష్టత లేకపోయినా అధికారులు మాత్రం ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించేలా ముందస్తుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే నిర్వహించడానికి సన్నద్ధమౌతున్నారు. భౌతిక దూరం పాటిస్తూ.. పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు.
జిల్లాలోని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయుల నుంచి వివరాలు సేకరించారు. గతంలో పరీక్షలు నిర్వహించనున్న కేంద్రాలు భౌతిక దూరం పాటించేలా కావాల్సిన వసతులు తదితర అంశాల వారీగా వివరాలు సేకరించి నివేదిక సిద్ధం చేశారు.
బల్లకు ఒకరు
ఇంతకు ముందు పరీక్షల నిర్వహణకు 279 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆ కేంద్రాల్లో అవసరమైన ఫ్యాన్లు, విద్యుత్తు దీపాలు ఇలా అన్ని సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించాలంటే బల్లకు ఓ విద్యార్థి చొప్పున కేటాయించాలని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. ఇంతకుముందు బల్లకు ఇద్దరు ఉండేవారు. జిల్లాలోని ఆయా ఉన్నత పాఠశాలల్లో ఉన్న తరగతి గదులను బట్టి ఒక్కో గదిలో 8 నుంచి 12 బల్లలు పడతాయని ఉపాధ్యాయులు ఉన్నతాధికారులకు నివేదించారు.