అనంతపురం జిల్లాకు చెందిన ఏఆర్ కానిస్టేబుల్ కె.ప్రకాశ్‌ను ఉద్యోగం నుంచి తొలగించేందుకు రంగం సిద్ధమైంది. గార్లెదిన్నెకు చెందిన ఓ వివాహితను పెళ్లి పేరుతో మోసగించి ఆమె నుంచి డబ్బు, బంగారం కాజేశారన్న ఆరోపణలపై 2019 జులైలో గార్లెదిన్నె పోలీసుస్టేషన్‌లో నమోదైన ఓ కేసుకు సంబంధించి ఈ ఏడాది జూన్ 17న శాఖాపరమైన విచారణ (ఓఈ) నిర్వహించిన పోలీసు అధికారులు అభియోగం రుజువైందంటూ తాజాగా ప్రకాశ్‌కు నోటీసు ఇచ్చారు. 2014లో కదిరిలో నమోదైన మరో కేసులోనూ గత నెల 18, 19 తేదీల్లో శాఖాపరమైన విచారణ చేపట్టారు. ఈ ఘటనలోనూ అభియోగాలు రుజువయ్యాయని చర్యలకు సిఫార్సు చేశారు. వీటి ఆధారంగా అతన్ని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగించేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. ఒకటి, రెండు రోజుల్లో ఆదేశాలు జారీకానున్నట్లు తెలిసింది.
సీఎం ముందు ప్లకార్డుతో ప్రదర్శన:సీఎం జగన్ జూన్ 14న సత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా అనంతపురం పోలీసు అమరవీరుల స్మారక స్థూపం వద్ద ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్.. ‘సరెండర్ లీవులు, అదనపు సరెండర్‌ల లీవుల సొమ్ములు ఇప్పించండి.. సీఎం సార్ ప్లీజ్’ అన్న ప్లకార్డును ప్రదర్శించి నిరసన తెలిపారు. ఆ తర్వాత నుంచే అతనిపై వేధింపులు పెరిగాయని, ప్రతి కదలికపై నిఘా పెట్టారని ప్రకాశ్ సంబంధీకులు ఆరోపిస్తున్నారు. అతని వ్యక్తిత్వాన్ని హననం చేసేలా దుష్ప్రచారం చేస్తున్నారని, పాత కేసుల్ని తెరపైకి తెస్తున్నారని చెబుతున్నారు.