ఆ కార్యాలయం ఓ మాయా ప్రపంచం. అక్కడికి ఎవరూ నేరుగా వెళ్లి పని చేయించుకోలేరు. ఏ చిన్న పని జరగాలన్నా బయట ఉండే దస్తావేజు లేఖర్ల ద్వారా వెళ్లాల్సిందే. మీరు స్థలమో, పొలమో అమ్మాలన్నా కొనాలన్నా ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ రుసుము కడితే చాలదు. ‘ఫీజు టు ఫీజు’ పేరిట మళ్లీ కొంత మొత్తాన్ని సార్లకు సమర్పించుకోవాలి. ఇందులో ఏ మాత్రం తేడా వచ్చినా దస్త్రం అక్కడే నిలిచిపోతోంది. రాష్ట్రవ్యాప్తంగా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కొర్రీలతో నిలిచిపోయిన లక్షకుపైగా డాక్యుమెంట్లలో అత్యధికం ఇలా ‘తేడాలు’ వచ్చి నిలిచిపోయినవే. అవినీతికి రిజిస్ట్రేషన్ చేసి వ్యవస్థీకృతంగా మార్చిన సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల దందా ఇటీవల వివాదాస్పద, నిషిద్ధ భూముల రిజిస్ట్రేషన్లతో మరోమారు తెరపైకి వచ్చింది.
అనంతపురం జిల్లా హిందూపురం సబ్‌రిజిస్ట్రార్ 2019లో కొట్నూరు గ్రామంలో అయిదెకరాల నిషిద్ధ భూమికి రిజిస్ట్రేషన్ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఇన్‌ఛార్జి సబ్ రిజిస్ట్రార్ నిషిద్ధ భూమి వ్యవహారంలో కోర్టు అటాచ్‌మెంట్ ఉత్తర్వులున్నా.. ఉల్లంఘించి మరీ రిజిస్ట్రేషన్ కానిచ్చేశారు. వీరిద్దరినీ ఉన్నతాధికారులు సస్పెండు చేయడంతో ఈ కార్యాలయాల్లో అవినీతి మరోసారి రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. విజయనగరం జిల్లా గజపతినగరం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం సహా పలుచోట్ల ప్రైవేటు వ్యక్తులు కంప్యూటర్ల వద్ద కనిపిస్తున్నారు. చాలాచోట్ల రికార్డు అసిస్టెంట్ల పనీ వీరే చేస్తున్నారు.
అయితే ఓకే
వ్యవసాయ భూములను వాటి యజమానులు మరొకరికి విక్రయించేందుకు వెళ్లినప్పుడు వారి వద్ద లింకు డాక్యుమెంట్లు, ఇతర పత్రాల్లోని వివరాల్లో తేడా ఉంటే.. ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా, పాన్ నంబరు, డ్రైవింగ్ లైసెన్సు, ఓటరు కార్డు వంటి ఇతర ఆధారాలతో తరచి చూడొచ్చు. కానీ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయ సిబ్బంది కొర్రీలు వేసి ఆపేస్తున్నారు. మామూళ్లు ఇచ్చేస్తే ఇవేమీ కనిపించవు.
నిషిద్ధ భూముల రిజిస్ట్రేషన్ల తంతు ఇలా..
నిషిద్ధ జాబితాలో ఉన్న భూములను ఆ సర్వే నంబర్లు కాకుండా వివాదం లేని, సరైన సర్వే నెంబర్లు వేసి, రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. కొన్నాళ్ల తర్వాత సర్వే నంబరు తప్పు వచ్చిందని సవరణ దరఖాస్తు పెడుతున్నారు. విశాఖ, చిత్తూరు, నెల్లూరు, ఇతర జిల్లాల్లో ఈ దందా ఎక్కువగా ఉంది. రిజిస్ట్రేషన్ శాఖలో అమల్లో ఉన్న ‘ఎనీవేర్ రిజిస్ట్రేషన్’ విధానం ప్రకారం గుంటూరులో ఉన్న ఆస్తిని ఒంగోలులోనూ రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు. ఈ ప్రక్రియ త్వరగా జరగాలంటే మాత్రం ‘సహజ పద్ధతి’ అనుసరించాల్సిందే.
‘ఫీజు టూ ఫీజు’ సంస్కృతి మారదా!
రాష్ట్రంలో సంవత్సరానికి 18 లక్షల డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. ఇందులో 50% వరకు ఆస్తుల విక్రయ దస్తావేజులే. వీటిద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.3వేల కోట్ల రాబడి వస్తోంది. వీటికి అదనంగా ‘ఫీజు టూ ఫీజు’ పేరు చెప్పి కక్షిదారుల నుంచి వసూలు చేసిన మొత్తం లేఖర్ల ద్వారా కొందరు సబ్ రిజిస్ట్రార్లు, వీరి ద్వారా పర్యవేక్షణ అధికారులకు అందుతోంది. విజయవాడలో ఓ వ్యక్తి ఇంటి కొనుగోలు కోసం వెళితే లేఖరి ఫీజు టు ఫీజు కింద రూ.27వేలు అడిగాడు. రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ దందాకు అడ్డుకట్ట పడటం లేదు. ఒకవేళ లేఖరి తక్కువ మొత్తం తీసుకుంటే సబ్ రిజిస్ట్రార్లు ఊరుకోవడం లేదు.
ఎన్నెన్నో అవకతవకలు