తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది యువతకు మెరుగైన ఉపాధి కప్పించింది, కల్పిస్తున్నది సాఫ్ట్‌వేర్ సేవల రంగమే. అందుకే ఇంజినీరింగ్‌లో సీఎస్‌ఈ గ్రూపులకు గిరాకీ ఎక్కువ. తెలంగాణలోని హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఐటీ పరిశ్రమలో ఇప్పటికే దాదాపు 6 లక్షల మంది పనిచేస్తున్నారు. కొత్త సాంకేతికతలు, డిజిటలైజేషన్‌తో మరిన్ని ఉద్యోగావకాశాలు సిద్ధంగా ఉన్నాయి. నిపుణులను గుర్తించి, నియామకాలు చేపట్టేందుకు సాఫ్ట్‌వేర్ సంస్థలు క్యాంపస్ ఇంటర్వ్యూలతోపాటు, సొంత పరీక్షలు కూడా నిర్వహిస్తున్నాయి. ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలో లేదా పూర్తయిన తరువాత వాటిని రాయొచ్చు.
యాప్‌లు.. సాఫ్ట్‌వేర్ కోర్సులు..
ఉద్యోగి అయినా, ఉద్యోగార్థి అయినా సాఫ్ట్‌వేర్ రంగంలో నిత్యనూతన విద్యార్థిలా కొత్త సాంకేతికతలను నేర్చుకోవాల్సిందే. ముఖ్యంగా ఆఫ్ క్యాంపస్ ఉద్యోగాలు(Campus Placements) సాధించాలనుకునే వారికి కోడింగ్ నైపుణ్యాలు తప్పనిసరి. ఇందుకు ప్రత్యేక యాప్‌లు, హ్యాకర్‌ర్యాంక్ లాంటి వెబ్‌సైట్లు అందుబాటులో ఉన్నాయి. ఉడెమీ, కోర్సెరా లాంటి యాప్‌లు అసైన్‌మెంట్లు, కోర్సులను అందిస్తున్నాయి. కొన్ని యాప్‌లు తక్కువ మొత్తం రుసుంతో సేవలు అందిస్తున్నాయి. తెలంగాణ నైపుణ్య అకాడమీ(టాస్క్(Telangana Academy of skills and Knowledge))లో నమోదైన విద్యార్థులకు సర్టిఫికేషన్ కోర్సులు అందిస్తోంది. ఇంజినీరింగ్ సహా ఇతర డిగ్రీలు పూర్తిచేసిన వారికి ఫినిషింగ్ స్కూళ్ల(కొలువుకు అవసరమైన నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు)నూ నిర్వహిస్తోంది. విద్యార్థులు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధాన మంత్రి కౌశల్ రుణ యోజనను వినియోగించుకోవచ్చు. జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నడిచే ఎన్‌ఎస్‌క్యూఎఫ్‌లో నమోదైన శిక్షణ సంస్థకు ఆన్‌లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రవేశపరీక్షలో అర్హత సాధిస్తే బ్యాంకు రుణం పొందే అవకాశం ఉంటుంది. ఉద్యోగం వచ్చాక ఐదేళ్లలో విడతల వారీగా రుణం చెల్లించవచ్చు.
ఒక్కో సంస్థదీ ఒక్కో బాట
- టీసీఎస్ సంస్థ జాతీయ స్థాయిలో అర్హత (ఎన్‌క్యూటీ) పరీక్ష నిర్వహిస్తోంది. వేర్వేరు విభాగాల్లో నిపుణులను గుర్తించేలా స్మార్ట్ హైరింగ్, నిన్‌జా, డిజిటల్, టీసీఎస్ కోడ్‌విటా అనే పేర్లతో ఉంటాయి. ఈ పరీక్షల తాలూకూ స్కోరును టీసీఎస్‌తోపాటు ఇతర ఐటీ కంపెనీలూ ప్రామాణికంగా తీసుకుంటున్నాయి.
- విప్రో సంస్థ విప్రో ఎలైట్, ఇన్ఫోసిస్.. ఇన్ఫీటీక్యూ, హ్యాక్ విత్ ఇన్ఫీ పేర్లతో, వర్చుసా కంపెనీ న్యూరల్ హ్యాక్ పేరుతో పరీక్షలు నిర్వహిస్తున్నాయి.
- ఇవే కాదు ఇతర ప్రముఖ ఐటీ కంపెనీలు విద్యార్థి చదివిన బ్రాంచీతో సంబంధం లేకుండా జాతీయస్థాయి ఎంపిక పరీక్షల ద్వారా నియామకాలు చేపడుతున్నాయి. ఇంజినీరింగ్, డిగ్రీ చివరి ఏడాది విద్యార్థులు, రెండేళ్లలోపు అనుభవమున్న ఫ్రెషర్స్ వాటిని రాసేందుకు అర్హులు. కొన్ని నియామకాలకు మాత్రం బ్యాక్‌లాగ్స్ లేకుండా కనీస మార్కులు తప్పనిసరి.