ఓబుళాపురం గనుల కేసుపై సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. అభియోగాల నమోదుపై వాదనలకు ఐఏఎస్ శ్రీలక్ష్మి తరఫు న్యాయవాది సమయం కోరారు. పిటిషనర్ అభ్యర్థన పరిగణలోకి తీసుకున్న కోర్టు... తదుపరి విచారణలో వాదనలు వినిపించాలని స్పష్టం చేసింది. అలా వినిపించకపోతే వాదనలు లేనట్లుగానే పరిగణిస్తామని తెలిపింది.
కేసు నుంచి తనను తొలగించాలని కోరుతూ తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు గనుల శాఖ మాజీ సంచాలకుడు వీడీ రాజగోపాల్ దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్పై కౌంటరు దాఖలు చేసేందుకు సీబీఐ గడువు కోరింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి కృపానందం, గాలి జనార్దన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు అలీఖాన్ డిశ్చార్జ్ పిటిషన్లపై వాదనలు వినిపించేందుకు కూడా సమయం ఇవ్వాలని సీబీఐ కోరింది. ఓఎంసీ కేసు విచారణను జనవరి 8కి న్యాయస్థానం వాయిదా వేసింది.