జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ... అన్ని రాష్ట్రాల న్యాయ సేవల ప్రాథికార సంస్థల ఛైర్మన్లు సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. న్యాయసేవా సంస్థలు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అంశాలు, వ్యవస్థాగతంగా బలోపేతం చేయాల్సిన విషయాలు వివరించారు. దేశవ్యాప్తంగా ఉన్న న్యాయసేవా సంస్థల ప్రణాళికలు, ఆలోచనలు తెలుసుకొని వాటి అమలు కోసం మరింత సమన్వయంతో పనిచేయడం ఎలా అనే అంశంపై చర్చించారు. అర్హులైన పేదలకు కోర్టుల్లో న్యాయసహాయం అందించడం కోసం తీసుకోవాల్సిన చర్యలు, ప్యానెల్ న్యాయవాదులకు నిర్మాణాత్మక శిక్షణ తరగతులపైనా మాట్లాడారు. జాతీయ న్యాయసేవా ప్రాధికార సంస్థ జారీ చేసిన మార్గదర్శకాలు జిల్లా స్థాయి సంస్థలు సమర్థంగా అమలు చేయడం, వాటి పనితీరు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంపై జస్టిస్ ఎన్.వి.రమణ దిశానిర్దేశం చేశారు. అన్ని న్యాయసేవా ప్రాధికార సంస్థల కార్యాలయాలను వన్‌స్టాప్ సెంటర్లుగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఈ రంగాన్ని మరింత నైపుణ్యంగా, సమస్యలపై వెంటనే స్పందించేలా తీర్చిదిద్దే అంశంపైనా చర్చించారు.
న్యాయవాదులకు శిక్షణ
అరెస్టుకు ముందు.. అరెస్టు... రిమాండ్ దశల్లో అందించే సహాయం గురించి విస్తృత ప్రచారం కల్పించడంపై దృష్టిపెట్టాలని జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. న్యాయ సహాయం అవసరమైన సందర్భాల్లో ఒక వ్యక్తిని పోలీసు స్టేషన్‌కు పిలిపించినప్పటి నుంచీ సమర్థంగా సాయం అందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రీ-అరెస్ట్, అరెస్టు, రిమాండ్‌లకు సంబధించిన న్యాయపరమైన అంశాలపై న్యాయవాదులకు పూర్తిస్థాయి శిక్షణ ఇప్పించాలని, అప్పుడు వారు కక్షిదారుల తరఫున సమర్ధంగా కోర్టుల్లో వాదనలు వినిపించగలుగుతారని అభిప్రాయపడ్డారు. అప్పీళ్లు దాఖలు చేయాలనుకున్న ఖైదీల్లో ఎవరు న్యాయం సహాయం కోసం ఎదురుచూస్తున్నదీ గుర్తించి వారి తరఫున సకాలంలో అప్పీళ్లు దాఖలు చేసేలా చూడాలని నిర్దేశించారు. అలాగే అండర్ ట్రయల్స్‌లో బెయిల్ దరఖాస్తుల దాఖలు కోసం ఎదురుచూస్తున్న వారిని గుర్తించి వెంటనే తగిన సాయం అందించాలన్నారు.