తెలంగాణప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా రాజధాని హైదరాబాద్‌లో కరోనా విస్తరిస్తూనే ఉంది. వివిధ ప్రాంతాల్లో కనీస జాగ్రత్తలు తీసుకోకుండా వేలాదిమంది వీధుల్లోకి రావడంతో కొవిడ్ చాపకింద నీరులా పాకుతోంది. నగరంపై దృష్టి సారించి వైరస్ విస్తరించకుండా చర్యలు చేపట్టాలని, లక్షకుపైగా ర్యాపిడ్ పరీక్షలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్, వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదేశాలతో అధికారులు కదిలారు. ఈనెల 8 నుంచి 14 వరకు 9,707 ర్యాపిడ్ పరీక్షలు చేయగా 1602 మందికి పాజిటివ్ అని తేలింది. మంగళవారం 3,597 మందికి పరీక్షలు చేయగా 607 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అంటే 16.5 శాతం మందికి వైరస్ ఉన్నట్లు తేలిందని హైదరాబాద్ జిల్లా వైద్య శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఘోరంగా విఫలం
కరోనా వైరస్ వెలుగులోకి వచ్చిన తొలినాళ్లలో మహానగరంలో వ్యాధిగ్రస్తుల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. వైరస్ వ్యాప్తి చెందిన ప్రాంతాలను కంటెన్మెంట్ జోన్లగా ప్రకటించి కఠిన ఆంక్షలు విధించడం వల్ల జన సంచారం చాలావరకు తగ్గింది. వైరస్ విస్తరణ కూడా అంతగా లేదు. అయితే నెలరోజులుగా జీహెచ్‌ఎంసీ, వైద్య, పోలీసు శాఖలు కొంత నిర్లక్ష్యం ప్రదర్శించాయి. వ్యాధిగ్రస్తులను గురించడంలో ఘోరంగా విఫలమయ్యాయి. పాజిటివ్ వచ్చిన వారి విషయంలోనూ తగిన చర్యలు తీసుకోలేదు. పాజిటివ్ వచ్చిన వారితో తిరిగిన వారిని గుర్తించి వారిని ఇళ్లలోనే స్వీయ నిర్బంధం చేసి ఉంటే బాగుండేది. తమ సిబ్బందికీ వైరస్ సోకడంతో కరోనా బాధితుల ఇళ్లను గుర్తించే ప్రక్రియను బల్దియా దాదాపుగా నిలిపివేసింది. కొన్ని జోన్లలో తూతూమంత్రంగా చేపట్టారు.