కరోనా రోగులకు సాయం అందించేందుకు 10 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందుబాటులో ఉంచినట్లు ఎన్టీఆర్ ట్రస్టు ప్రకటించింది. హోమ్ ఐసోలేషన్‌లో ఉంటున్న కొవిడ్ బాధితులకు.. తెదేపా నేతల సమన్వయంతో అందిస్తున్న వైద్య సేవలపై ఓ ప్రకటన విడుదల చేసింది. క్వారంటైన్లో ఉంటూ భోజనానికి ఇబ్బంది పడుతున్న వైరస్ బాధితులకు.. పార్టీ తరఫున ఇంటి వద్దకే ఆహారం అందించే ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఆకలితో ఉన్న పేదలకు తెదేపా నాయకులు, కార్యకర్తలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది.
కొవిడ్‌తో బాధపడుతున్న వారికి వాట్సప్ ద్వారా వైద్య సేవలను ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఎన్టీఆర్ ట్రస్టు గుర్తు చేసింది. త్వరలోనే ఓ కాల్ సెంటర్ సైతం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఆన్లైన్ ద్వారా ఇప్పటివరకు 545 మందికి వైద్య నిపుణులు సలహాలు, సూచనలు అందించినట్లు పేర్కొంది. వీరిలో 185 మంది వైరస్ నుంచి పూర్తిగా కోలుకోగా.. మిగిలిన వారు వైద్యుల పర్యవేక్షణలో సలహాలు తీసుకుంటున్నారని తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యాలయాల ద్వారా.. ఉచితంగా మందులు, భోజనం, నిత్యావసర వస్తువులను నేతలు అందిస్తున్నారని వివరించింది. కరోనా ఉధృతిలో ఎవరికి ఏ కష్టమొచ్చినా ఆదుకునేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్ ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది.