NTR centenary celebrations: స్వర్గీయ ఎన్టీఆర్ శత జయంతి వేడుకలను ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ఘనంగా నిర్వహించారు. తెదేపా సినీయర్ నాయకులు డా.మన్నే రవీంద్ర ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ప్రధాన కూడలిలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి జోహార్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఒంగోలు సమీపంలో జరుగుతున్న పసుపు పండగ 'మహానాడు'కు తెలుగు తమ్ముళ్లు బల్దేరారు. మన్నె రవీంద్ర వాహనాలను జెండా ఊపి సాగనంపారు.
కృష్ణా జిల్లా గన్నవరంలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, నేతలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించారు. తెదేపా, తెలుగు ప్రజల అభ్యున్నతికి ఎన్టీఆర్ సేవలను కొనియాడారు. కేక్ కోసి నేతలకు పంపిణీ చేశారు. కావాలనే రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తున్నారని ఎమ్మెల్సీ అర్జునుడు ధ్వజమెత్తారు. గన్నవరం నియోజకవర్గ కేంద్రంలో ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సుమారు 200 ఫ్లెక్సీలను ధ్వంసం చేశారని తెదేపా నేతలు ఆరోపించారు. సామాజిక న్యాయం పేరిట వైకాపా తలపెట్టిన బస్సు యాత్ర ఇవాళ గన్నవరం చేరనున్న నేపథ్యంలో.. తొలుత శతజయంతిని పురస్కరించుకుని తెదేపా నేతలు స్థానిక హైవేపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించి వాటి స్థానంలో వైకాపా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారని మండిపడ్డారు. మరోవైపు గాంధీబొమ్మ కూడలిలో సీనియర్ ఎన్టీఆర్ విగ్రహం కనిపించకుండా స్టేజ్ కట్టడంపై మండిపడ్డారు.
మహాపురుషుడు ఎన్టీఆర్ గుడివాడ ప్రాంతంలో పుట్టి, ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడం తమకు గర్వకారణమని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. గుడివాడలో నిర్వహించిన ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో మాజీ మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఎన్టీఆర్ జిల్లాగొల్లపూడిలో మాజీ మంత్రి తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వర రావు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. గొల్లపూడి వన్ సెంటర్లో భారీ కేక్ కట్‌చేశారు. అనంతరం వందలమంది తేదేపా కార్యకర్తలతో కలిసి మహానాడు కార్యక్రమానికి బస్సుల్లో బయల్దేరారు.
*జగన్ ప్రభుత్వ వికృత చేష్టలు, విధానాలకు ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చే.. ఒంగోలు మహానాడుకు పెద్ద ఎత్తున జనం తరలివస్తున్నారని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. విజయవాడ నగరంలోని ఎన్టీఆర్ సెంటర్లో ఎన్టీఆర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నందమూరి తారక రామారావు ఆశయాలను జైలులో ఉండి వచ్చిన వక్తితో పోల్చుతున్నారని విమర్శించారు. ఎన్టీఆర్ జీవితం తెల్లని కాగితమని, పోల్చుతున్న వారి జీవితం అందరికీ తెలుసన్నారు. అలీబాబా 40 దొంగళ్లలాగా మంత్రుల బస్సు యాత్ర చేస్తున్నారన్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్..మహానాడును కించ పరచాలని చూస్తే వైకాపానే పలచనపడి పోతుందని హెచ్చరించారు. తెదేపాకు గెలుపు, ఓటములకు సంబంధం లేకుండా పేదల కోసం పనిచేస్తుందని స్పష్టం చేశారు. 2024లో అత్యధిక స్థానాలు గెలుస్తామని రామ్మోహన్ ధీమా వ్యక్తం చేశారు.
అనంతపురంలో తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా పార్టీ శ్రేణులు ఘన నివాళులర్పించారు. ఆర్ట్స్ కళాశాల, జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలువేసి జోహార్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు. నాటికీ నేటికీ ఆయన అడుగుజాడల్లోనే తెదేపా అభివృద్ధి కోసం కృషి చేస్తామన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న వైకాపా అరాచక పాలనకు స్వస్తి చెప్పేలా ప్రజలను చైతన్య పరుస్తామని తెలిపారు. అనంతరం మాజీ మంత్రి పరిటాల సునీత జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి సంబురాలు చేసుకున్నారు.
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో ఎన్టీఆర్ శతజయంతి ఘనంగా జరుపుకొన్నారు. పట్టణంలోని ఎన్ఆర్టీ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పూలమాల వేసి నివాళులర్పించారు. తెదేపా శ్రేణులు, పార్టీ అభిమానులు ఏర్పాటు చేసిన 100 కిలోల కేకు కట్ చేసి పంచిపెట్టారు. తెలుగు జాతి అభిమానించి గుండెల్లో పెట్టుకున్న గొప్ప నాయకుడు నందమూరి తారక రామారావని, రాజకీయ చైతన్యంతో పాటు ఆనాటికీ ఈనాటికీ సామాన్యుడు, పేదవాడికి కావాల్సిన పథకాలను 40 ఏళ్ల ముందే ఆలోచించి పెట్టిన గొప్ప నాయకుడు అంటూ కొనియాడారు. దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకులలో ఎన్టీఆర్ ముందుంటారని.. అలాంటి మహోన్నత వ్యక్తికి భారతరత్న ఇవ్వాలని తెలుగు జాతి మొత్తం ముక్తకంఠంతో కోరుకుంటుందన్నారు. మహానాడులో ప్రజా స్పందన చూసి అధికార పార్టీ నాయకుల వెన్నులో వణుకు పుడుతోందని, గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఎద్దేవా చేశారు. భవిష్యత్తులో జగన్ నిద్రలేని రాత్రులు గడిపే పరిస్థితులు ఉంటాయని ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.