NTR: ఆరు పదుల వయసులో రాజకీయ పార్టీని స్థాపించి, అధికారంలోకి రావడమే విశేషమైతే.. ఏడున్నరేళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో ఎన్టీఆర్ తీసుకున్న ప్రతి నిర్ణయమూ ఓ అసాధారణ సంస్కరణే. రాజకీయాన్ని సామాన్యుడి చెంతకు చేర్చిన ప్రజా నాయకుడాయన. రాజకీయాలంటే వ్యాపారం కాదని.. పేదల అభ్యున్నతి, సంక్షేమమే పరమావధి అని చాటిన అభ్యుదయవాది.
ఆడపిల్లలకు ఆస్తిలో సగం వాటా ఇచ్చినా, పేదలకు రెండు రూపాయలకే కిలో బియ్యం పంచినా, సగం ధరకే జనతా వస్త్రాలు అందించినా, పక్కా ఇళ్లు కట్టించినా, వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు, రాజకీయాల్లోనూ ఉన్నత స్థానాలు కల్పించినా ఆయనకు ఆయనే సాటి. పేదలకు కూడు, నీడ, గుడ్డ ప్రాథమిక అవసరాలుగా గుర్తించి.. అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచీ వాటిని అమలు చేసేందుకు కంకణం కట్టుకున్న పేదల పక్షపాతి. తెలుగువారంతా నోరారా అన్నా అని పిలుచుకునే ఎన్టీఆర్ 99వ పుట్టిన రోజు నేడు.
ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించే వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలన్నీ భూస్వాములు, మోతుబరులు, కొన్ని సామాజికవర్గాల చేతుల్లోనే ఉండేవి. ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల్లో తప్ప మిగతా స్థానాల్లో దాదాపుగా వారే పోటీ చేసేవారు. వెనుకబడిన వర్గాలకూ నామమాత్రపు ప్రాధాన్యమే. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీదే గుత్తాధిపత్యం. అడుగడుగునా అవినీతి, బంధుప్రీతి, ఆశ్రితపక్షపాతమే. దిల్లీ నుంచే ఇక్కడి ముఖ్యమంత్రుల్ని ఆటబొమ్మల్లా ఆడించేవారు. ఇందిరాగాంధీ ప్రధాని అయ్యాక ఇది మరింత ప్రబలింది. ముఖ్యమంత్రుల్ని పదేపదే మార్చడంతో రాజకీయ అస్థిరత నెలకొనేది. కాంగ్రెస్‌కు మరో ప్రత్యామ్నాయమే లేదనుకున్న దశలో... రాజకీయాల్లో ప్రవేశించిన ఎన్టీఆర్.. ఆ పార్టీని తొమ్మిది నెలల్లోనే మట్టి కరిపించారు.
రాజ్‌భవన్‌లో కొద్ది మంది ఆహూతుల సమక్షంలోనే ముఖ్యమంత్రి, మంత్రులు ప్రమాణస్వీకారం చేసే పద్ధతినీ ఎన్టీఆరే మార్చారు. లాల్‌బహదూర్ స్టేడియంలో జనవాహిని మధ్య ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ హయాంలో ముఖ్యమంత్రులు ఎక్కువ శాఖల్ని తమ వద్దే అట్టేపెట్టుకునేవారు. ఎన్టీఆర్ ఎక్కువ శాఖలను మంత్రులకే కేటాయించారు. 15 రోజులకోసారి మంత్రివర్గ సమావేశాలు నిర్వహించి, క్షుణ్నంగా చర్చించేవారు.
1983 ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చాక.. రాజకీయాల్ని సమూలంగా ప్రక్షాళించేందుకు కంకణం కట్టుకున్నారు. ఎమ్మెల్యేలకు ప్రవర్తన నియమావళి జారీ చేశారు. వారు ప్రజలకు అందుబాటులో ఉండాలనీ, ఉద్యోగులు బదిలీలు, నియామకాల్లో జోక్యం చేసుకోకూడదని, అవినీతి నిర్మూలనకు సహకరించాలని పేర్కొన్నారు.
పెట్టుబడుల కోసం విదేశీ పర్యటన: దేశంలో ఆర్థిక సంస్కరణలకు చాలా ముందే ఎన్టీఆర్ స్వేచ్ఛావాణిజ్యాన్ని నమ్మారు. ప్రవాసాంధ్రుల నుంచి పెట్టుబడులు ఆకర్షించేందుకు 1984లో వాణిజ్య, పారిశ్రామికవేత్తల బృందాన్ని తీసుకుని అమెరికాలో పర్యటించారు. అలాంటి ప్రయత్నం దేశంలో అంతకు ముందు ఎప్పుడూ జరగలేదు.
నిజాయతీ ఆయనకు ప్రాణం
- ఎన్టీఆర్‌కు నిజాయతీ అంటే ప్రాణం. సొంత డబ్బును ఎంత పొదుపుగా వాడేవారో, ప్రభుత్వ ధనం విషయంలో అంతకంటే జాగ్రత్తగా ఉండేవారు. ముఖ్యమంత్రిగా నెలకు ఒక్క రూపాయి గౌరవ వేతనం మాత్రమే తీసుకున్నారు. అధికారిక నివాసానికి మారలేదు. అంబాసిడర్ కారు చాలనేవారు.
- ఆయన మొదటిసారి ముఖ్యమంత్రయినప్పుడే అప్పటి కార్మికశాఖ మంత్రి రామచంద్రరావు లంచం తీసుకున్నారన్న ఆరోపణలు రావడంతో ఏసీబీతో సోదాలు చేయించి, మంత్రి పదవి నుంచి తొలగించారు.
- మంత్రి జీవన్‌రెడ్డి కలర్‌టీవీ కొన్నారని తెలిసి ఆయనను ప్రశ్నించారు. వాయిదాల పద్ధతిలో కొన్నానని రసీదు చూపించాకే శాంతించారు.
- వారసులను రాజకీయాలకు దూరంగా పెట్టారు.
సంస్కరణలకు ఆద్యుడు
- ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చే వరకు ఆంధ్ర ప్రాంతంలో మున్సబు, కరణాలు, తెలంగాణలో పటేల్, పట్వారీలు గ్రామాలను ఉక్కుపిడికిలిలో పెట్టుకున్నారు. ఆ వ్యవస్థను ఎన్టీఆర్ రద్దు చేశారు.
- వృత్తి విద్యా కళాశాలల్లో క్యాపిటేషన్ ఫీజు రద్దు చేశారు. సీట్లు అమ్ముకోవడాన్ని నిషేధించారు.వాటిల్లో ఎస్టీ, ఎస్సీ,బీసీలకు రిజర్వేషన్లు కల్పించారు ఇంజినీరింగ్, వైద్య కళాశాలల్లో ప్రవేశాలకు ఎంసెట్ తీసుకువచ్చారు.
- కంప్యూటర్ల వినియోగాన్ని స్వాగతించారు.
- ప్రభుత్వ వైద్యుల ప్రైవేటు ప్రాక్టీసును నిషేధించారు.
విద్యారంగంపై ప్రత్యేక శ్రద్ధ
- విద్యారంగంలోనూ సంస్కరణలకు నడుంకట్టారు. తిరుపతిలో పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు. ఆరోగ్య విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పారు. 1985లో తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశారు.
- యూనివర్సిటీలు, ఉన్నత విద్యా మండలిలో నియామకాల్లో ప్రతిభకే ప్రాధాన్యమిచ్చారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌గా ఉండాల్సింది విద్యావేత్తే తప్ప, విద్యామంత్రి కాదంటూ.. ప్రొ.కె.రామకృష్ణారావును ఛైర్మన్‌గా నియమించారు. ప్రత్యేక వైద్య విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు.
- బడి పిల్లలకు విద్యపై అభిరుచి పెంచేలా బాపు, రమణలతో ఆడియో విజువల్ పాఠాలు తయారుచేయించారు. వాటిని ప్రదర్శించేందుకు 11 వేల పాఠశాలలకు కలర్ టీవీలు అందజేశారు. హైస్కూళ్లలో ఒకేషనల్ శిక్షణ ప్రవేశపెట్టారు.
- ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల కోసం జిల్లాకో గురుకుల విద్యాలయం ఏర్పాటు చేశారు. వాటి స్ఫూర్తితోనే కేంద్రం జవహర్ నవోదయ విద్యాలయాల్ని ఏర్పాటు చేసింది.
- రూ.2కే కిలో బియ్యం: ఏ పండగకో తెల్ల అన్నం తినే పేద కుటుంబాలకు రెండు పూటలా అన్నం పెట్టేందుకు 1983 ఏప్రిల్ 14న రెండు రూపాయలకే కిలో బియ్యం పథకాన్ని ప్రారంభించారు. దారిద్య్రరేఖకు కొలమానమైన వార్షికాదాయ పరిమితిని రూ.3,600 నుంచి రూ.6 వేలకు పెంచి, 1.43 కోట్ల కుటుంబాలకు ఈ పథకం లబ్ధి అందించారు.
జెండా, ఎజెండా.. ఆయనదే: 1982 మార్చి 29న ఎమ్మెల్యే క్వార్టర్స్ ఆవరణలో పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు ఎన్టీఆర్ ప్రకటించారు. ‘నేను తెలుగువాడిని, నాది తెలుగుదేశం పార్టీ’ అని పేర్కొన్నారు. స్వయంగా చిత్రకారుడైన ఆయన రామకృష్ణ సినీ స్టూడియోలో కూర్చుని, తెల్లకాగితంపై నాగలి, గుడిసె, చక్రంతో పార్టీ జెండా గీశారు. నాగలి రైతులకు, గుడిసె పేదలకు, చక్రం శ్రామికులకు సంకేతమన్నారు.
రాజకీయాల్లోకి కొత్త నీరు:20 మంది వైద్యులు, 47 మంది న్యాయవాదులు, 8 మంది ఇంజినీర్లు, 28 మంది పోస్ట్గ్రాడ్యుయేట్లు సహా 125 మంది పట్టభద్రులు.. వీరంతా 1983 ఎన్నికల్లో తెదేపా అభ్యర్థులు. ఎన్టీఆర్ రాజకీయాల గతిని ఎంతలా మార్చారో.. యువకులు, విద్యావంతులకు ఎంత పెద్ద ఎత్తున అవకాశాలిచ్చారో చెప్పడానికి ఈ జాబితాయే తార్కాణం. వెనుకబడిన కులాల్లో రాజకీయ స్ఫూర్తి రగిలించారు. వారికి రిజర్వేషన్లు కల్పించి, గెలిపించి మంత్రి పదవులు కట్టబెట్టారు.
పరిపాలనలోనూ విప్లవాత్మక మార్పులు:స్థానిక సంస్థలకు అధికారాల్ని బదలాయిస్తూ కేంద్ర ప్రభుత్వం 73, 74 రాజ్యాంగ సవరణలు చేయడానికి చాలా సంవత్సరాల ముందే ఎన్టీఆర్ అధికార వికేంద్రీకరణ చేశారు. తాలూకాలు, బ్లాక్‌లకు బదులు ప్రజల వద్దకే పాలన కోసం రెవెన్యూ మండలాలు, మండల పరిషత్‌లను ఏర్పాటు చేశారు. జిల్లా, మండల పరిషత్‌లతోపాటు, నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలకు తొలిసారి ప్రత్యక్ష విధానంలో ఎన్నికలు నిర్వహించారు. ప్రభుత్వ విభాగాల పనితీరులో సంస్కరణలు తెచ్చేందుకు మేనేజ్మెంట్ కన్సల్టెంట్ రుస్తుంజీని నియమించారు.
ఆ ప్రచారం ఓ జంఝామారుతం: ఇప్పుడు అన్ని పార్టీలు చేస్తున్న ‘రోడ్డు షో’లను ఎన్టీఆర్ నాలుగు దశాబ్దాల క్రితమే చేశారు. 1940 మోడల్ షెవర్లె వ్యాన్‌ను ‘చైతన్యరథం’గా మార్చుకుని రాష్ట్రమంతా తిరిగారు. ఖాకీ బట్టలు వేసుకుని, మండుటెండల్ని, దుమ్ము, ధూళిని లెక్కచేయకుండా రాష్ట్రమంతా సుడిగాలిలా చుట్టేశారు. ఎక్కడ జనం గుమికూడితే అక్కడ వాహనంపై నిల్చునే ప్రసంగించేవారు. ఆయన ఎక్కడికి వెళ్లినా జనం నీరాజనాలు పట్టారు. 5 వేల మందికి పైగా జనం ఉన్న సభలు రోజుకి 50 వరకు జరిగేవి. రాత్రి ఏ ఒంటిగంటకో రోడ్డుపక్కనున్న తోటలోనో, బడి ఆవరణలోనో వ్యాన్ నిలిపేవారు. అక్కడే నిద్ర, ఆరుబయటే స్నానం, బట్టలు ఉతుక్కోవడం. 60 ఏళ్లు దాటిన వయసులో 1982 అక్టోబరు 3 నుంచి 1983 జనవరి 3న తిరుపతిలో ప్రచారసభ ముగిసే వరకు.. 35 వేల కిలోమీటర్లకు పైగా ప్రయాణించిన మొండిఘటం ఆయన.
ప్రజా ఉద్యమంతో కుట్రల్ని ఛేదించి..: 1984లో ఎన్టీఆర్ గుండె శస్త్రచికిత్స కోసం అమెరికా వెళ్లారు. ఆర్థిక మంత్రిగా ఉన్న నాదెండ్ల భాస్కరరావు కాంగ్రెస్ మద్దతుతో కుట్ర చేసి ఎన్టీఆర్‌ను గద్దె దించారు. మెజార్టీ లేకపోయినా.. గవర్నర్ రామ్‌లాల్ ఆయనతో సీఎంగా ప్రమాణస్వీకారం చేయించారు. దాంతో రాష్ట్రం భగ్గుమంది. ఎన్టీఆర్‌కి మద్దతుగా ఉవ్వెత్తున ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమం సాగింది. ఉక్కిరిబిక్కిరైన అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ గవర్నర్‌ను మార్చేసి, నెల రోజుల్లోనే మళ్లీ ఎన్టీఆర్‌కి ప్రభుత్వ ఏర్పాటుకు వీలు కల్పించారు. 1985లో ఎన్టీఆర్ అసెంబ్లీని రద్దు చేసి, ఎన్నికలకు వెళ్లి, అసాధారణ మెజార్టీతో తిరిగి అధికారం చేపట్టారు.
మహిళలకు ఆస్తిలో సమాన హక్కు:ఎన్టీఆర్ అధికారంలోకి రాగానే మహిళాభ్యుదయానికి ప్రత్యేక ప్రాధాన్యమిచ్చారు. దేశంలోనే తొలిసారిగా. స్త్రీలకు ఆస్తిలో సమాన హక్కు ఉండాలంటూ 1984లో ప్రత్యేక చట్టం చేశారు. విద్య, ఉద్యోగాల్లో వారికి 30 శాతం రిజర్వేషన్లు కల్పించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ రిజర్వేషన్లు అమలు చేశారు.