ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జిల్లాకో ఆన్‌లైన్‌ పరీక్షా కేంద్రం.. విద్యార్థులకు తిప్పలు తప్పినట్లేనా..! - జాతీయ పరీక్షల సంస్థ తాజా వార్తలు

Online Examination Center for District : దేశవ్యాప్తంగా కొత్తగా జిల్లాకొక ఆన్‌లైన్ పరీక్ష కేంద్రం ఏర్పాటుకు జాతీయ పరీక్షల సంస్థ కసరత్తులు మొదలుపెట్టింది. మొత్తం 600కిపైగా జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.కేంద్రాల ఏర్పాటుకు ముందుకువచ్చే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుంచి వివరాలను సేకరిస్తోంది. అందుబాటులోకి వస్తే మూడు రోజుల్లోనే జేఈఈ మెయిన్‌ పూర్తిచేయొచ్చు.

Online Examination Center for District
Online Examination Center for District

By

Published : Jul 5, 2022, 9:39 AM IST

Online Examination Center for District : దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఒక ఆన్‌లైన్‌ పరీక్ష కేంద్రాన్ని నెలకొల్పాలని జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) సంకల్పించింది. మొత్తం 600కిపైగా జిల్లాల్లో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందుకు ముందుకొచ్చే ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల వివరాలు అందించాలని తాజాగా అన్ని విశ్వవిద్యాలయాలను ఎన్‌టీఏ కోరింది.

గత మూడు సంవత్సరాలుగా జేఈఈ మెయిన్‌, నీట్‌, యూజీసీ నెట్‌, జీప్యాట్‌, సీమ్యాట్‌, హోటల్‌ మేనేజ్‌మెంట్‌ జేఈఈ, సీయూఈటీ తదితర పరీక్షల నిర్వహణ బాధ్యతను కేంద్రం ఎన్‌టీఏకు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొన్నేళ్లుగా టీసీఎస్‌ అనుబంధ సంస్థతో కలిసి ఎన్‌టీఏ పరీక్షలను నిర్వహిస్తోంది. అయితే, తమ ఆధ్వర్యంలో పనిచేసేలా సొంతంగా పరీక్ష కేంద్రాలను నెలకొల్పాలని గతంలోనే ఎన్‌టీఏ నిర్ణయం తీసుకోగా.. వాటిని వచ్చే ఏడాదికల్లా పట్టాలెక్కించాలని భావిస్తోంది.

ఒక్క పూట 2 లక్షల మంది పరీక్ష రాసేలా...పరీక్ష కేంద్రం ఏర్పాటుపై ఆసక్తి ఉన్న ఒక్కో విద్యాసంస్థ కనీసం 6,500 చదరపు అడుగుల వసతి ఉన్న ఖాళీ భవనాన్ని ఇవ్వాలి. అందులో ఎన్‌టీఏ అధికారులు కంప్యూటర్లను ఏర్పాటు చేసి పరీక్షలు రాసేందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను ఇన్‌స్టాల్‌ చేస్తారు. ఫర్నిచర్‌నూ ఏర్పాటు చేస్తారు. ఒక్కో దాంట్లో కనిష్ఠంగా 250 మంది పరీక్ష రాస్తారు. అలా దేశం మొత్తం మీద ఒక్క పూటలో దాదాపు 2 లక్షల మంది పరీక్షలు రాయొచ్చు. అంటే జేఈఈ మెయిన్‌ ఇప్పటి మాదిరిగా వారం రోజులు కాకుండా మూడు రోజుల్లో పూర్తిచేయొచ్చు. ఆ పరీక్షకు అత్యధికంగా 11 లక్షల మంది దరఖాస్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయా విద్యాసంస్థలు వసతి కల్పిస్తే.. పరీక్ష ఫీజుల ద్వారా వచ్చే ఆదాయాన్ని తగిన నిష్పత్తిలో ఎన్‌టీఏ, విద్యాసంస్థలు పంచుకుంటాయి.

కాపీయింగ్‌కు అవకాశం లేకుండా..ఈ పరీక్ష కేంద్రాలను ఆయా కళాశాలలు తమ సిబ్బంది, విద్యార్థుల నైపుణ్యాన్ని పెంచుకునేందుకూ వినియోగించుకోవచ్చు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఒకే ప్రమాణాలతో కూడిన వాతావరణంలో కాపీయింగ్‌కు అవకాశం లేకుండా ఆన్‌లైన్‌ పరీక్షలు జరపొచ్చు. ముందస్తుగా నమూనా పరీక్షలను ఆయా కేంద్రాలకు వెళ్లి సాధన చేయొచ్చు. ప్రస్తుతం ఒక్కో కళాశాలలో ఒక్కో విధమైన కంప్యూటర్లు, వసతులు ఉంటున్నాయి. తాజాగా జరిగిన జేఈఈ మెయిన్‌లో కొన్ని కళాశాలల్లో కంప్యూటర్లు పనిచేయని విషయం తెలిసిందే.

ABOUT THE AUTHOR

...view details