ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 4, 2022, 6:23 PM IST

ETV Bharat / city

రాహుల్‌గాంధీ ముఖాముఖిపై.. మళ్లీ హైకోర్టును ఆశ్రయించిన ఎన్‌ఎస్‌యూఐ

TS High Court on Rahul Gandhi OU tour: తెలంగాణలోని ఓయూలో రాహుల్‌గాంధీ ముఖాముఖికి అనుమతి కోరుతూ ఎన్‌ఎస్‌యూఐ మళ్లీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టుకు వేసవి సెలవులు ఉన్నందున హౌజ్‌మోషన్ విచారణకు అనుమతివ్వాలని పిటిషనర్ల తరఫున న్యాయవాది న్యాయస్థానాన్ని కోరారు.

TS High Court on Rahul Gandhi OU tour
రాహుల్‌గాంధీ ముఖాముఖిపై.. మళ్లీ హైకోర్టును ఆశ్రయించిన ఎన్‌ఎస్‌యూఐ

TS High Court on Rahul Gandhi OU tour: తెలంగాణలోని ఓయూలో రాహుల్‌గాంధీ ముఖాముఖికి అనుమతి కోరుతూ ఎన్‌ఎస్‌యూఐ మళ్లీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టుకు వేసవి సెలవులు ఉన్నందున హౌజ్‌మోషన్ విచారణకు అనుమతివ్వాలని పిటిషనర్ల తరఫున న్యాయవాది న్యాయస్థానాన్ని కోరారు. ఎస్​యూఐ నేతలు మానవత రాయ్​, కొప్పుల ప్రతాప్​రెడ్డి, జగన్నాథ్ యాదవ్, ఎస్​. చందన రెడ్డి కోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.

తమ దరఖాస్తుపై ఓయూ అధికారులు ఎలాంటి నిర్ణయం వెల్లడించడం లేదని... ఈనెల 2న హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరుగుతున్న సందర్భంలోనే రాహుల్ కార్యక్రమానికి అనుమతి నిరాకరిస్తూ.. ఓయూ తన నిర్ణయాన్ని వెల్లడించింది. ఓయూ నిర్ణయాన్ని సవాల్​ చేస్తూ... తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. రాహుల్ గాంధీ ముఖాముఖి కేవలం విద్యార్థులను చైతన్య పరిచేందుకేనని... రాజకీయ ఉద్దేశాలు లేవని పిటిషన్​లో పేర్కొన్నారు. ఠాగూర్ ఆడిటోరియంలో కార్యక్రమం నిర్వహించడం వల్ల ఉద్యోగ సంఘాల ఎన్నికలకు, పరీక్షలకు ఎలాంటి ఆటంకం ఉండదని పేర్కొన్నారు.

ఇదే యూనివర్సిటీలో ఫిబ్రవరి 17న జరిగిన ముఖ్యమంత్రి పుట్టిన రోజు వేడుకల్లో పలువురు ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొన్నారని కోర్టుకు వివరించారు. భాజపా ఆధ్వర్యంలో మాక్ అసెంబ్లీ నిర్వహించారని గుర్తుచేశారు. ఈరోజే హౌజ్ మోషన్ విచారణ జరపాలని పిటిషనర్ల తరఫు న్యాయవాది కరుణాకర్ రెడ్డి కోరగా.. హైకోర్టు అంగీకరించింది.

గత విచారణలో...రాహుల్ గాంధీ ముఖాముఖి అనుమతి కోసం అందిన దరఖాస్తును పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ఉస్మానియా యూనివర్సిటీని హైకోర్టు ఆదేశించింది. ఓయూలో రాహుల్ గాంధీ కార్యక్రమానికి అనుమతివ్వాలని కోరుతూ ఎన్ఎస్​యూఐ నేతలు హైకోర్టును మే 2న ఆశ్రయించారు. హైకోర్టుకు వేసవి సెలవులు ఉన్నందున అత్యవసరంగా హౌజ్ మోషన్ విచారణ జరపాలని కోరారు. అంగీకరించిన జస్టిస్ విజయసేన్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం అత్యవసర విచారణ చేపట్టారు.

అయితే పిటిషన్​పై విచారణకు ముందే... దరఖాస్తును తిరస్కరిస్తూ ఓయూ ఉత్తర్వులు ఇవ్వడం గమనార్హం. దరఖాస్తును తిరస్కరిస్తున్నట్లు సోమవారం మధ్యాహ్నం ఓయూ ప్రకటించింది. క్యాంపస్​లో ఎలాంటి రాజకీయ కార్యక్రమాలకు అనుతివ్వరాదని గతేడాది పాలక మండలి తీర్మానం చేసినందున రాహుల్ గాంధీ కార్యక్రమానికి అనుమతివ్వలేమని ఓయూ తెలిపింది. ఉద్యోగ సంఘాల ఎన్నికలు, పరీక్షలు కూడా ఉన్నాయని పేర్కొంది. దీనిపై హైకోర్టుకు ప్రభుత్వ న్యాయవాది ఓయూ అనుమతి నిరాకరించినట్లు తెలిపారు. దీనితో ధర్మాసనం ఎలాంటి ఉత్తర్వులు లేకుండా విచారణ ముగిస్తున్నామని హైకోర్టు తెలిపింది. అనుమతి నిరాకరణపై అభ్యంతరాలుంటే మళ్లీ పిటిషన్ వేసుకోవచ్చని హైకోర్టు సూచించింది.

ఈ నేపథ్యంలో మళ్లీ హైకోర్టును ఎన్‌ఎస్‌యూఐ నేతలు ఆశ్రయించారు. హౌజ్‌మోషన్ విచారణకు అనుమతివ్వాలని కోరారు. రాహుల్‌గాంధీ ముఖాముఖికి ఓయూ అనుమతి నిరాకరణ అసమంజసమని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు.

ఇదీ చదవండి: వేసవి శిక్షణా శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి రోజా.. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గైర్హాజరు

ABOUT THE AUTHOR

...view details