రాజధాని పోరాటంలో అమరావతి రైతులకు అండగా నిలవడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారి బాధ్యత అని పలువురు ఎన్‌ఆర్‌ఐలు అభిప్రాయపడ్డారు. అమరావతిని కాపాడుకోవటం అంటే తెలుగుజాతి, సంస్కృతిని కాపాడుకోవడమేనన్నారు. రైతులకు ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై సిటింగ్‌జడ్జితో విచారణ జరిపి చట్టం ముందు నిలిపేవరకూ పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. ఇందులో తానాకు మరింత ఎక్కువ నైతిక బాధ్యత ఉందని చెప్పారు. అమరావతి ఉద్యమానికి తానా మద్దతు కోసం వెబినార్ నిర్వహించారు. ఇందులో ఆంధ్రరాష్ట్ర పరిరక్షణ సమితికి చెందిన లోకేశ్‌బాబు, వినీల, శివాని తదితర ఎన్‌ఆర్‌ఐలు, అమరావతి ప్రాంత రైతులు పాల్గొని మాట్లాడారు.
‘2014లో రాష్ట్రానికి రాజధాని కూడా లేకుండా విభజించినప్పుడు రైతులు కులమతాలకు అతీతంగా ముందుకొచ్చి స్వచ్ఛందంగా భూములిచ్చారు. స్వతహాగా సంపదను సృష్టించుకునే శక్తి అమరావతికి ఉంది. పార్లమెంటు నోటిఫై చేసిన అమరావతిని ఇప్పుడు రాజధానిగా చెప్పుకోలేని పరిస్థితుల్లో తెలుగు ప్రజలు ఉన్నారు. పాలకులు రైతుల్ని హింసిస్తున్నారు. జైళ్లలో పెడుతున్నారు. తినే అన్నంలో మట్టి పోస్తున్నారు. దీనిపై మానవత్వం ఉన్న వారందరూ స్పందించాలి. రాజకీయాలకు అతీతంగా రాజధానిగా అమరావతి పరిరక్షణ ఉద్యమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు అండగా ఉన్నారనే ధైర్యం ఇవ్వాలి. అమరావతిని రాష్ట్రానికి ఏకైక రాజధానిగా నిలిపే ఈ పోరాటానికి తానా మద్దతుగా నిలవాలి’ అన్నారు.