NRIs Given Support To Amaravati Farmers: ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా అమరావతిని ప్రకటించి అభివృద్ధి చేయాలని అమెరికాలోని ప్రవాసాంధ్రులు కోరారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమం ప్రారంభమై 1000 రోజులు పూర్తవుతున్న సందర్భంగా రాజధాని ప్రాంత రైతులకు సంఘీభావంగా అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో శనివారం ప్రవాసాంధ్రులు ప్రదర్శన నిర్వహించారు. ‘అలుపెరగని ఉద్యమం.. అమరావతి ఉద్యమం, అమరావతిని అభివృద్ధి చేయాలి’ అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. తెదేపా నేత, మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. కోర్టు తీర్పును బేఖాతరు చేస్తూ మాస్టర్‌ప్లాన్‌కు విరుద్ధంగా సీఆర్‌డీఏ చట్టాన్ని మార్చేందుకు వైకాపా ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఆన్‌లైన్‌లో తెదేపా అమెరికా విభాగం కోఆర్డినేటర్ జయరాం కోమటి మాట్లాడుతూ.. అమరావతి రాజధాని మాత్రమే కాదని, సంపద సృష్టించే నగరమని చెప్పారు. ప్రభుత్వ వైఖరిలో మార్పు రాకపోగా.. మళ్లీ మూడు రాజధానులంటూ కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందని పలువురు ప్రవాసాంధ్రులు పేర్కొన్నారు. గుంటూరు మిర్చి యార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు, భాను మాగులూరి, మన్నవ వెంకటేశ్వరరావు, యడ్ల హేమప్రసాద్, సాయి బొల్లినేని, రామకృష్ణ ఇంటూరి, ఈశ్వర్ కక్కెర, పెద్ద ఎత్తున ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు.
Amaravati Maha Padayatra: సోమవారం గుంటూరు జిల్లా వెంకటపాలెంలో మొదలు కానున్న అమరావతి మహాపాదయాత్ర. సరిగ్గా రెండు నెలల తర్వాత నవంబర్ 11న శ్రీకాకుళం జిల్లా అరసవల్లిలో ముగియనుంది. అదే రోజు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. అమరావతిపై జరుగుతున్న కుట్రను ప్రజలకు వివరించడంతోపాటుగా.. పరిరక్షించుకోవాల్సిన ఆవశ్యకతను ప్రజలకు తెలియజేస్తామని రైతులు చెబుతున్నారు. 12 పార్లమెంట్, 45అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా యాత్ర సాగే యాత్రలో.. మోపిదేవి, ద్వారకాతిరుమల, అన్నవరం, సింహాచలం పుణ్యక్షేత్రాలను దర్శించుకోనున్నారు. అలాగే ఈసారి జాతీయ రహదారుల వెంట కాకుండా పల్లెలు, పట్టణాల ద్వారా నడిచేలా రైతులు రూట్‌మ్యాప్ రూపొందించారు. యాత్రకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా, వివిధ కమిటీలు సమన్వయం చేసేలా ప్రణాళిక తయారు చేశారు.