అమెరికాలో ఉంటున్న ఓ ట్రక్ డ్రైవర్ ఓ ఐపీఎస్ అధికారిణికి సంక్షిప్త సందేశాలు పంపి.. ఆమెను కలిసేందుకు వచ్చి.. పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో జరిగింది. నగరంలోని జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పంజాబ్ రాష్ట్రం అమృత్‌సర్ సమీపంలోని తర్న్‌తరన్ ప్రాంతానికి చెందిన మల్‌రాజ్ సింగ్ అలౌక్(29) కాలిఫోర్నియాలో ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి గ్రీన్‌కార్డు సైతం ఉంది. పంజాబ్ క్యాడర్‌కు చెందిన ఓ మహిళా ఐపీఎస్ అధికారిణికి అతను కొన్నాళ్లుగా సామాజిక మాధ్యమాల్లో సంక్షిప్త సందేశాలు పంపుతున్నాడు.
ఇదీ చదవండి :Baby in train toilet: అప్పుడే పుట్టిన శిశువు.. రైలు టాయిలెట్లో వదిలివెళ్లిన తల్లి
ఆమె జనవరి 17 నుంచి ఏప్రిల్ 29 వరకు జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ)లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. అందులోని ఓ అతిథి గృహంలో ఉంటున్నారు. మల్‌రాజ్‌సింగ్ అలౌక్ ఆమె కోసం అమెరికా నుంచి నేరుగా పంజాబ్ వచ్చాడు. హైదరాబాద్‌లో శిక్షణలో ఉన్నట్లు తెలుసుకొని నేరుగా ఇక్కడికి వచ్చాడు.
ఈనెల 1న ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీకి వెళ్లి వివరాలు తెలుసుకొని అధికారిణి ఉంటున్న అతిథిగృహం వద్దకు వెళ్లాడు. అలౌక్‌తో మాట్లాడటానికి ఆమె నిరాకరించి ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ ఉన్నతాధికారులకు విషయాన్ని తెలిపారు. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. సోమవారం నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.