NRI Marriage Frauds : ‘కాంతం పిన్నీ.. మన సోనాకి సంబంధం కుదిరింది. అబ్బాయి ఆస్ట్రేలియాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఎన్‌ఆర్‌ఐ సంబంధం కోసం ఎన్నాళ్లుగానో వెతుకుతున్నాం.. మొత్తానికి ఖాయమైంది. పెళ్లికి నువ్వు తప్పకుండా రావాలి..’ అంటూ ఆనందం పట్టలేకపోయింది సోనా తల్లి సుగుణ. ఇలా లక్షలు వరకట్నం పోసి, అరకిలో దాకా బంగారమిచ్చి.. బంధువుల సమక్షంలో అంగరంగ వైభవంగా సోనా పెళ్లి చేశారు ఆమె పేరెంట్స్. వారం రోజుల్లోనే విజిటింగ్ వీసా మీద సోనాను ఆస్ట్రేలియా తీసుకెళ్లాడు ఆమె భర్త.
కట్ చేస్తే..!
NRI Marriage Frauds in Telangana : నెల తిరగకముందే సూట్‌కేస్‌తో పుట్టింటికి తిరిగొచ్చేసింది సోనా. ‘అదేంటమ్మా.. చెప్పా పెట్టకుండా వచ్చేశావ్.. అబ్బాయేడి?’ అని ఆతృతగా అడిగారు ఆమె తల్లిదండ్రులు. ‘నీ అల్లుడు నన్ను మోసం చేశాడమ్మా.. అతనికి ఇంతకుముందే పెళ్లైంది.. ఇప్పటికే అక్కడో పెళ్లాన్ని పెట్టుకొని డబ్బు కోసం మళ్లీ నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఈ నెల రోజులూ నాకు నరకం చూపించాడమ్మా.. ఎలాగోలా తప్పించుకొని ఆ నరకం నుంచి బయటపడ్డా..’ అంటూ తల్లి మీద పడి భోరుమంది సోనా.
NRI Marriage Frauds in India : ప్రస్తుతం ఇలాంటి సమస్యే ఎదుర్కొంటోన్న ఓ నవ వధువు.. లక్షల కట్నం ఇచ్చి.. తను సంతోషంగా ఉన్నారని ఉవ్విళ్లూరుతున్న తల్లిదండ్రులకు తన బాధ చెప్పుకోలేక సతమతమవుతోంది. ఎన్‌ఆర్‌ఐ సంబంధాలంటే.. ఆలోచించకుండా కూతుర్లను కట్టబెట్టే తల్లిదండ్రులకు.. విదేశాలకు వెళ్లొచ్చని ఆరాటపడి ఉబ్బితబ్బిబై పెళ్లి చేసుకుంటున్న అమ్మాయిలకు తన గాధ ఓ కనువిప్పు కావాలని కోరుకుంటోంది. తనకు జరిగిన అన్యాయం మరో ఆడపిల్లకు జరగకూడదని.. తన కథను అందరితో పంచుకుంటోంది. ఇంతకీ ఎవరామే? ఆమ విషాద గాథ ఏంటి? తెలుసుకుందాం రండి..
NRI Gay Married a Woman : నా పేరు పూర్ణిమ. మాది గుంతకల్లు దగ్గర ఓ పల్లెటూరు. నాన్న వ్యవసాయం చేస్తుంటారు. అమ్మ గృహిణి. నాకు ఒక చెల్లి, తమ్ముడు ఉన్నారు. మాకు వ్యవసాయ భూములతో పాటు పాల వ్యాపారం కూడా ఉంది. ఆర్థికంగా మరీ శ్రీమంతులం అని చెప్పలేను కానీ.. ఉన్నంతలోనే ఏ లోటూ లేకుండా మమ్మల్ని పెంచారు నాన్న. చిన్నప్పటి నుంచి చదువు, బట్టలు.. ఇలా ప్రతి విషయంలోనూ మా ఇష్టాయిష్టాలకే ప్రాధాన్యమిచ్చారు. ఇక మా అమ్మ గురించి చెప్పాలంటే.. తను మాకు తల్లిగానే కాదు.. ఒక ఫ్రెండ్‌గా అన్ని సలహాలూ ఇస్తుంటుంది. అది బాధైనా, సంతోషమైనా అందరం కలిసే పంచుకునే వాళ్లం. ఇలా నేను, తమ్ముడు, చెల్లి చిన్నతనం నుంచీ స్నేహపూర్వక వాతావరణంలో పెరిగాం..
NRI Gay Married a Woman for Dowry : ఇంటర్ వరకు మా ఊర్లోనే చదివినా.. బీటెక్ కోసం హైదరాబాద్ వచ్చాను. మొదట్లో ఇంటిని మిస్సవుతున్నాననిపించేది.. కానీ తర్వాత నెమ్మదిగా ఇక్కడి లైఫ్‌స్టైల్‌కి అలవాటు పడిపోయా. అందుకు నా ఫ్రెండ్స్ కూడా ఓ కారణమే అని చెప్తా. ఎందుకంటే ఈ నాలుగేళ్లలో వాళ్లు నాతో అంత బాగా కలిసిపోయారు మరి! ఇక పండగలు, ఇతర శుభకార్యాలప్పుడు నా ఫ్రెండ్స్‌ని కూడా నాతో తీసుకెళ్లడం, వారిళ్లలో ఫంక్షన్లైతే నేనూ వెళ్లడం.. ఇలా బీటెక్ నాలుగేళ్లు చూస్తుండగానే గడిచిపోయాయి. ఫైనలియర్ తుది సెమిస్టర్ పరీక్షలకు ముందు ఓసారి ఇంటికి రమ్మని అమ్మానాన్న నాకు కబురు పెట్టారు. అంత అర్జెంట్ ఏంటి అని అడిగినా అప్పుడు వాళ్లు నాకు చెప్పలేదు. ఇక వెళ్లాక తెలిసింది.. నాకు పెళ్లి సంబంధం వచ్చింది.. చూడ్డానికి అబ్బాయి వాళ్లు వస్తున్నారని!
‘అబ్బా.. అప్పుడే నాకు పెళ్లేంటమ్మా.. ఇంకా చదువుకోవాలి’ అని వాళ్లతో చెప్పాను. కానీ ‘నీకు వచ్చింది అల్లాటప్పా సంబంధమనుకున్నావా.. ఎన్‌ఆర్‌ఐ సంబంధం.. మన దూరపు బంధువుల అబ్బాయే! పేరు రాహుల్.. అమెరికాలో సొంతంగా బిజినెస్ చేస్తున్నాడు. నాలుగు చేతులతో సంపాదిస్తున్నాడు.. నువ్వు అతనితో సుఖపడతావమ్మా.. మా మాట విను!’ అంటూ నా పేరెంట్స్ నన్ను ఒప్పించారు. ‘అయినా చిన్నప్పటి నుంచి ఏది అడిగితే అది ఇచ్చారు.. నాకేం కావాలో నాకన్నా బాగా మీకే తెలుసు..’ అంటూ సంతోషంగా పెళ్లి చూపులకు రడీ అయిపోయా. మా ఇంట్లో తొలి శుభకార్యం కదా.. పెళ్లి చూపులకు కూడా మా బంధువులందరూ రావడంతో ఇల్లంతా సందడిగా మారింది. అంతలోనే అబ్బాయి వాళ్లొచ్చేసి హాల్‌లో కూర్చున్నారు. నేను నా గదిలో ముస్తాబవుతున్నా.. ఇక పెళ్లి కొడుకును చూసిన నా చెల్లి నా దగ్గరకొచ్చి.. ‘అక్కా.. బావ చాలా అందంగా ఉన్నాడు..’ అంది. అప్పటిదాకా ఏ అబ్బాయి గురించీ ఆలోచన రాని నాకు.. చెల్లి ఆ విషయం చెప్పగానే అతడిని ఎప్పుడెప్పుడు చూద్దామా అన్న ఆతృత నాలో మొదలైంది.
ఆ క్షణం రానే వచ్చింది.. అమ్మ నన్ను తీసుకెళ్లడానికి నా గదిలోకొచ్చింది.. అబ్బాయికి ఎదురుగా ఉన్న కుర్చీలో నన్ను కూర్చోబెట్టింది. ఓరగా తనవైపు చూశా.. తనూ నన్ను చూశాడు. అమ్మాయి నాకు నచ్చేసింది అని అందరి ముందే చెప్పాడు. అతను నాకూ నచ్చాడు.. కానీ అందరి ముందు సిగ్గుతో చెప్పలేకపోయా. అంతలోనే ‘నేను తనతో ఒంటరిగా మాట్లాడాలనుకుంటున్నా..’ అన్నాడు. ఓవైపు సిగ్గు, బిడియం, మరోవైపు లోలోపల సంతోషంతోనే తనను నా గదిలోకి తీసుకెళ్లా. నా అభిప్రాయం అడిగాడు.. నచ్చారని చెప్పా. ఆ తర్వాత మా ఇష్టాయిష్టాలు, అభిరుచుల గురించి మాట్లాడుకున్నాం.. ‘పెళ్లయ్యాక వెంటనే మనం అమెరికా బయల్దేరాలి..’ అన్నాడు. అందుకు సరేనన్నా. వాళ్లు వెళ్లిపోయాక అమ్మానాన్నలకూ నా అభిప్రాయం చెప్పాను. చాలా సంతోషించారు. ఎన్నారై సంబంధం.. ఇక నా కూతురికి ఏ ఢోకా లేదు అని సంబరపడిపోయారు. పరీక్షలయ్యాక పెళ్లి ముహూర్తం కూడా ఫిక్స్ చేసేశారు. ఇదే సంతోషంలో తేలియాడుతూ నేనూ తిరిగి హైదరాబాద్ చేరుకున్నా.
చూస్తుండగానే పరీక్షలు కూడా పూర్తయ్యాయి. నేను-రాహుల్ ఫోన్‌లో మాటల్లో పడిపోయి రోజులు క్షణాల్లా గడిచిపోయాయి. పెళ్లి ముహూర్తం దగ్గర పడింది. ముందు నిశ్చితార్థం జరిగింది. అలాగే హల్దీ, సంగీత్, మెహెందీ.. ఇలా పెళ్లికి ముందు అన్ని ఫంక్షన్లూ ఘనంగా జరిగాయి. ఎంగేజ్ మెంట్ లో రాహుల్ నా వేలికి డైమండ్ రింగ్ తొడిగాడు. మా ఇంట్లో ఇది మొదటి శుభకార్యం కాబట్టి చాలామంది బంధువులు వచ్చారు. వారందరి ఆశీర్వాదాలు, అమ్మానాన్నల అంతులేని సంతోషం మధ్య మా వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇక పెళ్లి మండపంలోనే రాహుల్ నా చెవిలో.. ‘నీకో సర్‌ప్రైజ్.. కానీ ఇప్పుడు కాదు.. మన ఫస్ట్ నైట్ రోజు చెప్తా..!’ అంటూ గుసగుసగా చెప్పేసరికి నాకు సిగ్గు మొగ్గలేసింది. ఎప్పుడెప్పుడు ఆ రోజు వస్తుందా? ఏంటా ఆ సర్‌ప్రైజ్? అంటూ నాలో నేను ఊహించుకుంటూ కలల్లో మునిగిపోయా..