కొవిడ్ రెండో దశ గ్రామీణ భారతాన్ని కకావికలం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే వినూత్న కార్యచరణతో ముందుకొచ్చారు న్యూయార్క్‌కు చెందిన ప్రవాస భారత వైద్యులు, నిపుణులు. పల్లెల్లో కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ‘ప్రాజెక్ట్ మదద్’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి తెలంగాణ, ఆంధ్ర పల్లెల్లోని ఆర్‌ఎంపీలు, ఆరోగ్య కార్యకర్తలకు శిక్షణ అందిస్తున్నారు. కరోనా లక్షణాలను గుర్తించడం, తేలికపాటి కేసులకు ఇంటివద్దే చికిత్స అందించడం, టీకాపై సలహాలు, ఓవర్ మెడికేషన్ ప్రమాదాలు, ఇతర ఉత్తమ పద్ధతులను రోగులకు వివరించడంలో వారికి ‘మదద్’ వైద్య బృందం తోడ్పడుతోంది.
ఆర్‌ఎంపీలే కేంద్రంగా...
స్థానిక పరిస్థితులు, ప్రజల ఆరోగ్యంపై ఆర్‌ఎంపీలకు సరైన అవగాహన ఉంటుందనే భావనతో వారి కేంద్రంగా ఈ ప్రాజెక్టును రూపొందించారు. టీకాల సేకరణ, ప్రజలకు మాస్కులు, ఆక్సీమీటర్లు, ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ల సరఫరాపై ఆర్‌ఎంపీలకు స్థానిక భాషల్లో సమాచారం అందించడానికి ‘మదద్’ కృషిచేస్తోంది. వారానికి రెండుసార్లు వారితో అన్ని రకాల వైద్య నిపుణులు జూమ్‌లో సమావేశమై చికిత్సలో అనుమానాలను నివృత్తిచేస్తున్నారు.‘‘ తెలంగాణలోని కరీంనగర్‌లో సుమారు 80 శాతం కేసులు.. పల్లె ప్రాంతాల నుంచే వస్తున్నాయి. ఇతర ప్రాంతాల్లోనూ అదే పరిస్థితి. అందుకే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం’’ అని ప్రాజెక్ట్ సారథి రాజా కార్తికేయ అన్నారు.
అనుభవాల నుంచి..
ఏడాది కాలంగా అమెరికాలో కరోనా చికిత్సలో చేసిన పొరపాట్లు, నేర్చుకున్న పాఠాలను ఇక్కడి ఆరోగ్య కార్యకర్తలతో పంచుకోవాలనుకుంటున్నట్లు మినియాపొలిస్‌లో ప్రముఖ రేడియాలజీ నిపుణడు డా. సుబ్బారావు ఐనంపూడి తెలిపారు. ‘‘ప్రజల్లో భయాందోళనలను పోగొట్టి, జాగ్రత్తలు తీసుకునేలా ప్రోత్సహించడం ముఖ్యం. తేలికపాటి కేసులు తీవ్రంగా, ఆపై అతి తీవ్రంగా మారడాన్ని అరికట్టడంలో ఆర్‌ఎంపీలకు శిక్షణ ఇవ్వడంపై దృష్టి పెట్టాం’’ అని ఆయన చెప్పారు.
బృందంలో తెలుగు వెలుగులు