రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) నిధుల ఖర్చులో జరిగిన అవకతవకలు సామాజిక తనిఖీల్లో వెలుగు చూస్తున్నాయి. ఈ విషయాన్ని గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలోని రాష్ట్ర సామాజిక తనిఖీ, జవాబుదారీతనం, పారదర్శకత సంస్థ (ఏపీఎస్‌ఎస్‌ఏఏటీ) గుర్తించింది. 2016-17 నుంచి 2020-21 మధ్య ఐదేళ్లలో రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో చేసిన ఉపాధి పనులపై సామాజిక తనిఖీ బృందాలు పలు పంచాయతీల్లో 58,011 పనులపై ఆడిట్ నిర్వహించాయి. ఈ సందర్భంగా రూ.1,026 కోట్ల నిధులను నిబంధనలకు విరుద్ధంగా ఖర్చు చేసినట్లు గుర్తించారు. ఏపీఎస్‌ఎస్‌ఏఏటీ సిఫార్సులపై బాధ్యుల నుంచి రూ.309.57 కోట్ల రికవరీకి అధికారులు ఆదేశించారు.
ఎక్కడెక్కడ ఎలా అంటే?
- ప్రతిపాదిత పనులకు బదులుగా విజయనగరం, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాలోని పలు పంచాయతీల్లో వేరే పనులు చేశారు. అంటే, పంట కాలువ పనికి బదులుగా రోడ్డు పని చేయడం లాంటివి. ఒక ఏడాదిలో రాష్ట్రవ్యాప్తంగా 16 లక్షల పనులను పరిశీలిస్తే 2.60 లక్షలకుపైగా పనులు ఇలాగే చేశారని సామాజిక తనిఖీల్లో బయటపడింది.
- శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని పలు పంచాయతీల్లో చేసిన పనుల కంటే అదనంగా కొలతలు తీసినట్లు గుర్తించారు. ఇలా అదనపు నిధులు డ్రా చేసినట్లు గుర్తించి తదుపరి చర్యలకు ఆదేశించారు. ఒక ఏడాదిలో కనిష్ఠంగా 10 వేల పనులు, గరిష్ఠంగా 25 వేల పనుల్లో ఇలా అదనపు కొలతల మాయజాలం జరుగుతున్నట్లు తెలుస్తోంది.
రాజకీయ ఒత్తిడితో కిమ్మనని యంత్రాంగం