ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మైలేజీ తగ్గితే డ్రైవర్ల జీతం నుంచి రికవరీ.. ఆర్టీసీ డ్రైవర్లకు తాఖీదులు - ఏపీఎస్​ఆర్టీసీ వార్తలు

APSRTC NOTICE ON KMPL: మైలేజీ పేరిట ఆర్టీసీ డ్రైవర్లపై డిపోల్లో వేధింపులు పెరుగుతున్నాయి. మైలేజీ తగ్గితే జీతం నుంచి రికవరీ చేస్తామని తాఖీదులు ఇవ్వడంతో డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. కాలం చెల్లిన బస్సులు.. గుంతల రోడ్లు ఉండగా వీటితో మైలేజీ ఎలా సాధ్యమని చెబుతున్నా.. డిపోల్లో పట్టించుకోకుండా వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

APSRTC NOTICE TO DRIVERS ON KMPL
APSRTC NOTICE TO DRIVERS ON KMPL

By

Published : May 16, 2022, 5:34 AM IST

Updated : May 16, 2022, 12:20 PM IST

మైలేజీ పేరిట ఆర్టీసీ డ్రైవర్లపై డిపోల్లో వేధింపులు

APSRTC NEWS: బస్‌ మైలేజీ తగ్గినందుకు బాధ్యత వహించాలని.. అదనంగా వినియోగించిన డీజిల్‌కు అయిన వ్యయాన్ని జీతం నుంచి రికవరీ చేస్తామని పేర్కొంటూ ఆర్టీసీ డ్రైవర్లకు కొన్ని జిల్లాల్లో డిపో మేనేజర్లు తాఖీదులిస్తున్నారు. అయితే మైలేజీ తగ్గడానికి కారణాలను పరిశీలించకుండా నేరుగా జీతం నుంచి రికవరీ చేస్తామనడం ఏమిటని డ్రైవర్లు ప్రశ్నిస్తున్నారు. విశాఖపట్నం నగర పరిధిలోని సింహాచలం, అనకాపల్లి జిల్లాలోని అనకాపల్లి డిపోనకు చెందిన కొందరు డ్రైవర్లకు ఇటువంటి తాఖీదులు ఇచ్చినట్లు బయటపడింది. ఒక డ్రైవరు ఏప్రిల్‌లో ఓ మార్గంలో నడిపిన బస్సుకి మైలేజీ లీటర్‌కు 6 కి.మీ.లు (కేఎంపీఎల్‌) రావాల్సి ఉండగా 5.16 కి.మీ. వచ్చిందని లెక్కలు వేశారు.

దీనివల్ల 115 లీటర్ల డీజిల్‌ అదనంగా వినియోగించాల్సి వచ్చిందని, దీంతో రూ.12,075 నష్టం వచ్చినట్లు లెక్కించారు. ఈ మొత్తాన్ని జీతం నుంచి ఎందుకు రికవరీ చేయకూడదో వివరణ ఇవ్వాలంటూ తాఖీదు ఇచ్చారు. మరో డ్రైవర్‌కు 5.20 కేఎంపీఎల్‌కు బదులు 4.65 కేఎంపీఎల్‌ వచ్చిందని, 76 లీటర్ల డీజిల్‌ అదనంగా వినియోగించినందున రూ.7,980 జీతం నుంచి రికవరీకి నోటీసు ఇచ్చారు. కొద్ది రోజుల కిందట అనకాపల్లి డిపోలోనూ ఇదే విధంగా కొందరికి నోటీసులు ఇచ్చారు.

కాలంచెల్లిన బస్సులు.. గుంతల రోడ్లు: బస్‌ మైలేజీ రావాలంటే అనేక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. బస్‌ కండిషన్‌, రహదారులు బాగుండాలి. సామర్థ్యానికి మించి ప్రయాణికులు ఉండకూడదు. తరచూ ట్రాఫిక్‌ అవాంతరాలు రాకూడదు. ఇలా అన్ని పరిగణనలోకి తీసుకోవాలి. కానీ ఆర్టీసీలో ప్రస్తుతం కాలం చెల్లిన బస్సులు ఎక్కువగా ఉన్నాయి. అనేక చోట్ల రహదారులు బాగాలేవు. ఇలాంటి వాటిని అధికారులు పట్టించుకోవడంలేదని డ్రైవర్లు పేర్కొంటున్నారు. సాధారణంగా ఓ బస్‌ కేఎంపీఎల్‌ తగ్గితే.. ఆ డిపోలో ఉండే సేఫ్టీ డ్రైవింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌ను పంపి ఎందుకు మైలేజీ తగ్గుతుందో పరిశీలిస్తారు. డ్రైవర్‌ వైపు సమస్య ఉంటే జోనల్‌ శిక్షణ కళాశాలకు పంపి వారంపాటు శిక్షణ ఇస్తారు. కానీ ఇవేమీ చేయకుండా నేరుగా తాఖీదుతోపాటు, జీతం నుంచి రికవరీ చేస్తామని పేర్కొనడం ఏమిటని ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. మైలేజీ తక్కువ వస్తే పెంచేలా చూడాలని డ్రైవర్‌కు తాఖీదు ఇస్తారుగానీ, జీతం నుంచి రికవరీ చేసేలా ఇవ్వరని ఆర్టీసీ ఉన్నతాధికారులు తెలిపారు. ఇలా ఎందుకు ఇచ్చారో పరిశీలిస్తామని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

తాగునీటి సరఫరాకూ నిధులు కొరతే.. 2 ఏళ్లుగా నిధులు విడుదల చేయని ప్రభుత్వం

Last Updated : May 16, 2022, 12:20 PM IST

ABOUT THE AUTHOR

...view details