Senior citizens Difficulties: రాష్ట్రంలో ప్రభుత్వం ఇచ్చే పింఛన్‌తోనే జీవనం గడిపే వృద్ధులు ఉన్నారు. అయినవాళ్ల నిరాదరణ వల్ల ఆర్ధిక కష్టాలు పడేవారెందరో ఉన్నారు. ఇలాంటి వాళ్లు ఆసుపత్రులకు... ఇతర అవసరాలకు సుదూర ప్రాంతాలకు ప్రయాణాల్లో భారం పడకుండా గత ప్రభుత్వం బస్సులు, రైళ్లలో రాయితీలు కల్పించింది. సీనియర్ సిటిజన్లకు దూరంతో సంబంధంలేకుండా అన్ని బస్సుల్లో టికెట్‌పై 25శాతం రాయితీ అమలు చేస్తూ వచ్చారు. కొవిడ్ రాకతో వృద్దుల సంతోషం ఆవిరైంది. రెండేళ్ల క్రితం ఆర్టీసీ రాయితీలు ఎత్తివేసింది. కరోనా వ్యాప్తి తగ్గగానే పునరుద్దరిస్తామని అప్పట్లో అధికారులు చెప్పారు. కొవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పట్టినప్పుడల్లా రాయితీలు పునరుద్దరించాలని వృద్దులు కోరుతున్నారు. కానీ నష్టాలు పేరు చెప్పిన ఆర్టీసీ.. రాయితీలను పునరుద్దరించడం లేదు. ఫలితంగా ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులుచార్జీ చెల్లించి ప్రయాణించాల్సి వస్తోంది. రాయితీలపై ఆర్టీసీ అధికారులకు, ప్రభుత్వానికి వినతులు ఇచ్చినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆర్థికంగా భారమవుతుందంటున్న వృద్ధులు
రైళ్లలో ప్రయాణానికీ సీనియర్ సిటిజన్లు కష్టాలు పడుతున్నారు. కొవిడ్ వ్యాప్తి తగ్గాక రాయితీలు పునరుద్ధరించాల్సి ఉండగా నెలలు అవుతున్నా అలాంటి చర్యలేవీ తీసుకోలేదు. రైళ్లు, బస్సుల్లో రాయితీలు ఇవ్వకపోవడం వల్ల కొందరు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఇది ఆర్థికంగా తమకు భారమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాయితీల పునరుద్దరణపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుని అమలు చేయాలని సీనియర్ సిటిజన్లు కోరుతున్నారు.