రాష్ట్రంలో టీకా పంపిణీపై అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్‌లో ఏది ఎక్కడ వేస్తున్నారన్న విషయమై స్పష్టత లేనందున లబ్ధిదారులు గందరగోళపడుతున్నారు. ప్రతి జిల్లాలో కనీసం 100 నుంచి 170 చొప్పున టీకా కేంద్రాలు ఉన్నా... కొన్నింటిలో టీకాల పంపిణీ జరగడంలేదు. ఈ విషయం తెలియక కేంద్రాల చుట్టూ లబ్ధిదారులు తిరుగుతున్నారు. వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న తరుణంలో టీకా కోసం రోడ్ల వెంట తిరగాల్సి వస్తుండడం... ముఖ్యంగా పెద్ద వయసులో ఉన్న వారికి ఇబ్బందికరంగా మారింది. అలాగే రెండో డోసు టీకా వేయించుకోవాలని చరవాణులకు వస్తోన్న సంక్షిప్త సమాచారాన్ని అనుసరించి కొందరు ఆయా పంపిణీ కేంద్రాలకు వెళ్తున్నా అక్కడ టీకా ఉండడంలేదు. మరో రోజు రావాలని ఒకసారి... ఎప్పుడు వేస్తామో తెలియదని మరోసారి అక్కడి సిబ్బంది చెబుతుండటంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఒంగోలు నగరానికి చెందిన ఇందుర్తి కోటేశ్వరరావు దంపతులకు ఏప్రిల్ 29న రెండో డోసు వేయించుకోవాలని చరవాణికి మెసేజ్ వచ్చింది. ఆ మేరకు సంబంధిత కేంద్రానికి వెళ్లగా అక్కడ ఎవరూ లేరు. మరో కేంద్రానికి వెళ్లగా రెండో డోసు ఇవ్వడంలేదని, వారు వేయించుకున్న కంపెనీ టీకా పంపిణీ జరగడంలేదని చెప్పడంతో వెనక్కి వచ్చారు. ఇలాంటి పరిస్థితులు విజయవాడతోపాటు ఇతరచోట్ల కూడా నెలకొన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 10వ తేదీలోగా సుమారు లక్ష మందికి రెండో డోసు కింద టీకాల పంపిణీ జరగాల్సి ఉంది. జిల్లా టీకాల పంపిణీ పర్యవేక్షక అధికారి ఒకరు మాట్లాడుతూ ‘‘టీకా డోసులు అరకొరగా వస్తున్నాయి. వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యాలయం నుంచి వచ్చిన సమాచారం ప్రకారం మేము ఏర్పాట్లు చేస్తున్నాం. వచ్చిన డోసులను అనుసరించి కొన్నిచోట్లకు మాత్రమే పంపిణీ చేయగలుగుతున్నాం. దీనివల్ల కొన్ని కేంద్రాల్లో తాకిడి ఎక్కువగా ఉంటోంది. సాధ్యమైనంత వరకు ముందురోజే టీకా పంపిణీ వివరాలు చెప్పేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అని తెలిపారు.
ప్రైవేట్ ఆసుపత్రుల్లో బంద్
ప్రభుత్వ కేంద్రాల్లోనే కాకుండా ప్రైవేట్ ఆసుపత్రుల్లో నిర్ణీత రుసుముతో టీకా వేయించడాన్ని ఈనెల 1 నుంచి వైద్య ఆరోగ్య శాఖ నిలిపేసింది. దీనివల్ల కూడా కొందరు ఇబ్బంది పడుతున్నారు.