తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్లను పాత పద్ధతిలో నిర్వహించేందుకు అంతా సిద్ధమైంది. ఇందుకోసం రిజిస్ట్రేషన్లశాఖ యంత్రాంగాన్ని సమాయత్తం చేసింది. కార్డ్ విధానంలో రిజిస్ట్రేషన్లు చేసేందుకు రాష్ట్రంలోని 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను సిద్ధం చేసింది. స్లాట్ బుకింగ్‌తో సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్లు జరగనుండడంతో కొన్ని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రద్దీ నెలకొనే అవకాశం ఉందని ఉన్నతాధికారులు అంచనా వేశారు.
ఆదివారం సాయంత్రం సబ్ రిజిస్ట్రార్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు చేస్తుండడంతో... కొన్నిచోట్ల రద్దీ ఏర్పడే అవకాశం ఉందని, సంబంధిత సబ్‌రిజిస్ట్రార్లు ముందస్తుగా టోకెన్లు జారీ చేసి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. డాక్యుమెంట్లు పరిశీలన విషయంలో పాటించాల్సిన జాగ్రత్తలు వివరించి... రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన వారితో ఎలాంటి గొడవలు, వాగ్వాదాలు లేకుండా నడుచుకోవాలని స్పష్టం చేశారు.
లాక్‌డౌన్ వల్ల మార్చి మూడో వారం నుంచి రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు ఆగిపోయాయి. తిరిగి మే 11న ప్రారంభమయ్యాయి. అప్పటికి ఇంకా రాష్ట్రంలో కోవిడ్ తీవ్రత తగ్గలేదు. వ్యాపార, వాణిజ్య లావాదేవీలు పూర్తి స్థాయిలో పునరుద్ధరణ కాలేదు. ఫలితంగా ఆస్తుల క్రయవిక్రయాలు ఆశించిన స్థాయిలో జరగలేదు. వ్యాపార, వాణిజ్య లావాదేవీలు పుంజుకుని, ఆర్థిక పరిస్థితులు మెరుగై రిజిస్ట్రేషన్లు ఊపందుకునే సమయానికి రిజిస్ట్రేషన్ శాఖలో సమూల మార్పులు చేసేందుకు సెప్టెంబరు 8 నుంచి రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్లు నిలిపేసింది. కరోనా వల్ల దాదాపు 50 రోజులు, ప్రభుత్వం తీసుకున్న చర్యల వల్ల మరో 3నెలలు రిజిస్ట్రేషన్‌లు జరగలేదు. రోజుకు 30 నుంచి 40 కోట్ల మేర రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం పోయింది.
ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయ రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లుగానే వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్లను సరళతరం చేసేందుకు సమూల మార్పులు చేసింది. ధరణి పోర్టల్ ద్వారా వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్ల నిర్వహణపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం పరిధిలో ఉన్న కేసులు ఎప్పటికి పూర్తవుతాయో చెప్పడానికి అవకాశం లేకపోవడం వల్ల ప్రత్యామ్నాయంగా పాత పద్ధతిలో కార్డు విధానంలో రిజిస్ట్రేషన్లు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. న్యాయస్థానంలో కేసు విచారణ పూర్తై.. అనుకూలమైన తీర్పు వచ్చే వరకు పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు కొనసాగించనుంది.
ఇదీ చూడండి:
విద్యుత్ తీగలు తగిలి మంటలు.. 40 ద్విచక్రవాహనాలు దగ్ధం