ముప్పై ఏళ్లకుపైగా రాజకీయ జీవితంలో ఎందరో అభిమానాన్ని చూరగొన్న ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతి... ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలను కలచి వేసింది. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో బుధవారం ఉదయం నోముల కన్నుమూశారు. భౌతికకాయాన్ని కొత్తపేటలోని ఆయన నివాసానికి తరలించారు. అక్కడ నుంచి నాగార్జునసాగర్ నియోజకవర్గ కేంద్రమైన హాలియాకు తరలించారు. వివిధ మండలాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి... తమ అభిమాన నేతకు కన్నీటి నివాళులర్పించారు. అనంతరం, తెరాస శ్రేణులు, అభిమానుల విషణ్న వదనాల నడుమ ప్రత్యేక వాహనంలో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఆయన భౌతికకాయాన్ని నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రిలో భద్రపర్చారు.
సీఎం కేసీఆర్ హాజరు..
నోముల అంత్యక్రియలు గురువారం.. ఆయన స్వగ్రామమైన నకిరేకల్ మండలం పాలెంలో జరగనున్నాయి. వారి కుటుంబానికి చెందిన స్మృతివనంలో అంతిమసంస్కారాలు నిర్వహించనున్నారు. అంత్యక్రియలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. కేసీఆర్ రాకతో.. మంత్రి జగదీశ్‌రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్, ఎస్పీ రంగనాథ్ ఏర్పాట్లును పర్యవేక్షిస్తున్నారు.