ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

స్పెషలిస్టుల స్పందన కరవు!

కరోనా ఉద్ధృతికి తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలిక నియామకాలను చేపట్టినా.. స్పెషాలిటీ వైద్యుల నుంచి మాత్రం స్పందన నామమాత్రంగానే ఉంటోంది. కొందరు విధుల్లో చేరి కొద్ది రోజులకే వెళ్లిపోతున్నారు. వీరిలో కొందరు విధుల్లో చేరాక కొవిడ్‌ బారినపడితే మాత్రం మళ్లీ ఆసుపత్రి వైపు వచ్చేందుకు విముఖత చూపుతున్నారు.

corona virus
corona second wave

By

Published : May 9, 2021, 8:17 AM IST

కరోనా కేసుల పెరుగుదలకు తగ్గట్టు తాత్కాలిక పద్ధతిన జనరల్‌ ఫిజిషియన్లు, పల్మనాలజిస్టులు, మత్తుమందు వైద్యులను నియమించేందుకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రయత్నాలు ఫలించడం లేదు. కొవిడ్‌ ఆసుపత్రుల్లో స్పెషలిస్టుల సేవలు కీలకం. గతేడాది 22వేల మంది వైద్యులు, నర్సులు, ల్యాబ్‌టెక్నీషియన్లు, ఇతర సిబ్బందిని తాత్కాలిక పద్ధతిన నియమించారు. కిందటేడాదికంటే కేసులు ఎక్కువగా ఉన్నందున ఇదే సంఖ్యలో నియమించుకోవచ్చని వైద్య ఆరోగ్య శాఖ జిల్లా అధికారులకు సూచించింది. దీని ప్రకారం ఇప్పటివరకు జిల్లాల స్థాయిలో 17,500 నియామకాలను చేపట్టారు. కొందరు వైద్యులు విధుల్లో చేరుతున్నారు. అయితే స్పెషాలిటీ వైద్యుల నుంచి మాత్రం స్పందన నామమాత్రంగానే ఉంటోంది. కొందరు విధుల్లో చేరి కొద్ది రోజులకే వెళ్లిపోతున్నారు. విజయవాడ జీజీహెచ్‌లో తాజాగా ఆరుగురు వైద్యులు విధులకు దూరమయ్యారు. 13 జిల్లాల్లో కలిపి ఇప్పటివరకు 66 మంది స్పెషలిస్టులను నియమించారు. వీరిలో కొందరు విధుల్లో చేరాక కొవిడ్‌ బారినపడితే మాత్రం మళ్లీ ఆసుపత్రి వైపు వచ్చేందుకు విముఖత చూపుతున్నారు.

ప్రైవేటువైపు దృష్టి..

గతేడాది ప్రభుత్వ, ప్రైవేటు కలిపి 275 ఆసుపత్రుల్లో మాత్రం చికిత్సకు అనుమతి ఉండేది. ఈసారి వాటి సంఖ్య 600 దాటింది. ఇందులో 450 వరకు ప్రైవేటు, కార్పొరేటు ఆసుపత్రులున్నాయి. ఈ ఆసుపత్రులవారు ఎక్కువ వేతనాలు చెల్లిస్తుండడంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరాలనుకున్నవారు కూడా అటువైపు మొగ్గు చూపుతున్నారు.
*ఎంబీబీఎస్‌, ఎమ్మెస్సీ, బీఎస్సీ నర్సింగ్‌ విద్యార్థులకు రూ.15వేలు, రూ.10వేల చొప్పున గౌరవ వేతనం ఇస్తారు.
*ఎంబీబీఎస్‌ చివరి సంవత్సరం (పార్టు-2) విద్యార్థులు, ఎమ్మెస్సీ, బీఎస్సీ, జీఎన్‌ఎం కోర్సు చివరి సంవత్సరం విద్యార్థులను నియమించుకునేందుకు అనుమతినిస్తూ వైద్య ఆరోగ్య శాఖ జిల్లాలకు ఆదేశాలు పంపింది. వీరి సంఖ్య 15వేల వరకుంది.
*ఎంబీబీఎస్‌ విద్యార్థులకు రూ.15వేలు, ఇతర విద్యార్థులకు నెలకు రూ.10వేలను గౌరవం వేతనంగా ఇస్తారు. వీరి సేవలు 6నెలలపాటు ఉపయోగించుకోనున్నారు.

శాశ్వత ఉద్యోగాలపై ఆశ..
గతేడాది కొవిడ్‌ విధుల్లో చేరినవారు శాశ్వత ఉద్యోగాలు పొందారు. ఈసారి కూడా డేటాఎంట్రీ ఆపరేటర్‌, పారామెడికల్‌ స్టాఫ్‌, ఎఫ్‌ఎన్‌ఓ, ఎంఎన్‌ఓ, స్టాఫ్‌నర్సు పోస్టులపై యువత ఆశలు పెట్టుకుంది. ప్రస్తుతం సేవలందించే వారికి ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యమివ్వనున్నందున అభ్యర్థులు ముందుకొస్తున్నారు. జనరల్‌ మెడికల్‌ డ్యూటీ డాక్టర్లుగా సేవలందించేందుకు ఎంబీబీఎస్‌, దంత వైద్యులు సిద్ధమవుతున్నారు.

వేతనాల చెల్లింపులో సమస్యలు..
తాత్కాలిక పద్ధతిలో నియమిస్తున్న వీరికి వేతనాల చెల్లింపులో సమస్యలొస్తున్నాయి. తాత్కాలిక కాలవ్యవధి ముగియకముందే విధులనుంచి తప్పిస్తున్నారని.. వేతనాలను సక్రమంగా చెల్లించడం లేదని వారు గతేడాది పెద్దఎత్తున ఆందోళనలు చేశారు. వైద్య ఆరోగ్య శాఖ జారీ చేసిన ఆదేశాలకు భిన్నంగా జిల్లాల్లో నియామకాలు చేపట్టడం, వేతనాల ఖరారులో సమస్యల వల్ల వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది రోడ్డున పడ్డారు. ఇలాంటివి పునరావృతం కాకుండా వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకోవాల్సి ఉంది.

ఇదీ చదవండి:

ప్రతిధ్వని: కరోనా కాలంలో.. అమ్మపై ఎంత భారం పెరిగింది?

ABOUT THE AUTHOR

...view details