ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ముందస్తు ఖరీఫ్‌ 'సాగు'కు సన్నద్ధత ఏదీ? - ఖరీఫ్​ సాగుకు అందని నీరు

NO water for kharif crops: రాష్ట్రంలో ఖరీఫ్‌ సాగు ముందే చేపట్టాలని ప్రభుత్వం చెబుతున్నా..ఆదిశగా సన్నద్ధత కనిపించడం లేదు. ఇప్పటికీ కొన్ని చోట్ల కాలువల్లో పూడికతీత పనులు పూర్తి కాలేదు. ఏలూరు జిల్లాలో ప్రధాన కాలువ నుంచి ఇతర కాలువలకు ఇంకా సాగు నీరు చేరలేదు. దీని వల్ల సాగు ఆలస్యమవుతోందని శివారు ప్రాంత రైతులు ఆందోళన చెందుతున్నారు.

NO water for kharif crops
NO water for kharif crops

By

Published : Jun 12, 2022, 5:38 AM IST

ముందస్తు ఖరీఫ్‌ 'సాగు'కు సన్నద్ధత ఏదీ?

kharif crops: నవంబర్‌లో వచ్చే అకాల వర్షాలకు రైతులు నష్టపోకుండా, మూడో పంట సాగు చేసేందుకు వీలుగా ప్రభుత్వం ఖరీఫ్ సీజన్‌ ముందే ప్రారంభించాలని సూచించింది. ఆమేరకు జూన్ ఒకటినే సాగు నీరు విడుదల చేస్తామని ప్రకటించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో అధికారుల సూచన మేరకు సుమారు లక్షా 7వేల హెక్టార్ల మేర ఖరీఫ్ సాగు చేసేందుకు రైతులు సన్నద్ధమయ్యారు. ఐతే.. ఏలూరు కాలువలో పూడికతీత పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దెందులూరు మండలం ఉండ్రాజవరం వంతెన వద్ద నుంచి ఏలూరు వరకు పనులు చేయాల్సి ఉన్నా వేగంగా జరగడంలేదు. కేవలం తూడు , గుర్రపుడెక్క తొలగింపునకు మాత్రమే గుత్తేదారులు పరిమితమయ్యారు. ఏటా కాలువలకు నీరు వదిలిన తర్వాత గుత్తేదారులు తుతూమంత్రంగా పని చేసి... సొమ్ము చేసుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కాలువల్లో పూడిక తీయకుంటే ..చివరి పొలాలకు నీరు ఎలా అందుతుందని ప్రశ్నిస్తున్నారు.

పెద్ద కాలువకు నీళ్లు వదిలి 10 రోజులు దాటినా.. పంట బోదెలకు ఇంకా నీరు విడుదల చేయలేదు. దీని వల్ల సాగు ఆలస్యమవుతోంది. సాగు నీరు ఎప్పుడిస్తారని అధికారులను అడిగితే..అదిగో ఇదిగో అంటున్నారే తప్ప..సరైన సమాధానం ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు. ఏటా నీటి విడుదల ఆలస్యంతో పంట దిగుబడి తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం 30 నుంచి 35 బస్తాల దిగుబడి కూడా రావడం లేదని అంటున్నారు. ఈ నెల 15 కల్లా సాగు నీరు ఇచ్చే ఏర్పాట్లు చేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. ఉపాధి పనులు చేస్తున్నారు గాని రైతులకు ఎటువంటి ప్రయోజనం లేదని అన్నదాతలు అంటున్నారు. ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details