ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

SPANDANA: కలెక్టరేట్లకు వెల్లువెత్తుతున్న అర్జీలు.. పరిష్కారం కాని సమస్యలు

‘స్పందన’ కార్యక్రమంలో సమస్యల పరిష్కారం అంతంతమాత్రంగానే ఉంటోంది. మండల, జిల్లా స్థాయిలో సమస్యలు పరిష్కారం కావట్లేదు. ఆర్జీదారులు కలెక్టర్లకు వెల్లువెత్తున్నారు. ఒక్కో అభ్యర్థి నాలుగైదు సార్లు కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొట్టాల్సి వస్తోంది. పింఛన్లు, పాస్​బుక్కులు, సర్వేల ఫిర్యాదులే ఎక్కువగా ఉంటున్నాయి.

no sollution for spandana request from beneficiaries
no sollution for spandana request from beneficiaries

By

Published : Aug 26, 2021, 9:13 AM IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘స్పందన’ కార్యక్రమంలో సమస్యల పరిష్కారం అంతంతమాత్రంగానే ఉంటోంది. ఒకే సమస్య కోసం ప్రజలు నాలుగైదు సార్లు కలెక్టరేట్ల చుట్టూ చక్కర్లు కొట్టాల్సి వస్తోంది. జిల్లా, డివిజన్‌ కేంద్రాల్లో ‘స్పందన’ కార్యక్రమం ఎలా జరుగుతోంది? అర్జీదారులు ఎలాంటి సమస్యలతో వస్తున్నారన్న అంశాల్ని అన్ని జిల్లాల్లో గత సోమవారం ‘ఈనాడు యంత్రాంగం’ స్వయంగా పరిశీలించినప్పుడు అనేక విషయాలు వెలుగుచూశాయి. అమ్మఒడి, చేయూత, నేతన్న నేస్తం వంటి పథకాలు అందలేదని ఎక్కువ మంది అర్జీలతో వచ్చారు. గ్రామ సచివాలయాల్లో ఉండే సెక్రటరీలు, వెల్ఫేర్‌ అసిస్టెంట్లు కావాలనే తమకు పథకాలు అందకుండా చేశారని కొన్నిచోట్ల ఫిర్యాదులు చేశారు.

రిపాలన వికేంద్రీకరణకు గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి రెండేళ్లవుతున్నా, మండల స్థాయిలో యంత్రాంగం ఉన్నా... ప్రజలు ఇప్పటికీ దీర్ఘకాలిక సమస్యలతో పాటు, చిన్న చిన్న సమస్యల పరిష్కారానికీ జిల్లా కేంద్రం వైపు చూడాల్సి వస్తోంది. ప్రతి సోమవారం కలెక్టర్‌ ఆధ్వర్యంలో జరిగే ‘స్పందన’ కార్యక్రమానికి వస్తున్న ఫిర్యాదుల్లో... అర్హత ఉన్నా తమకు పింఛన్లు ఇవ్వడం లేదని, జాబితా నుంచి పేరు తొలగించారని, పట్టాదారు పాస్‌ పుస్తకాలు ఇవ్వడంలేదని, భూముల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయడం లేదని, భూవివాదాల పరిష్కారానికి సర్వే విషయంలో స్థానిక అధికారులు పట్టించుకోవట్లేదని వస్తున్నవే ఎక్కువ. ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకుల ఒత్తిడికి, ఇతర ప్రలోభాలకు తలొగ్గి సచివాలయ సిబ్బంది, మండలస్థాయి అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, అక్కడ న్యాయం జరగకే జిల్లా కేంద్రానికి వస్తున్నామని ఎక్కువ మంది చెబుతున్నారు. వారిలో నాలుగైదు సార్లు అర్జీ ఇచ్చినా సమస్య పరిష్కారం కానివారు, నెలలు, ఏళ్లతరబడి తిరుగుతున్నవారూ ఉన్నారు. జిల్లా, డివిజన్‌ కేంద్రాల్లో ‘స్పందన’ కార్యక్రమం ఎలా జరుగుతోంది? అర్జీదారులు ఎలాంటి సమస్యలతో వస్తున్నారు, వారి పరిస్థితి ఎలా ఉందన్న అంశాల్ని రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ‘ఈనాడు యంత్రాంగం’ గత సోమవారం స్వయంగా పరిశీలించింది. ఆ సందర్భంగా గుర్తించిన అంశాలివీ.

జిల్లా కేంద్రాల్లో ఇలా..

కరోనా ఉద్ధృతి కారణంగా దాదాపు అన్ని జిల్లాల్లో కొన్ని నెలలపాటు స్పందన కార్యక్రమం నిలిచిపోయింది. అప్పట్లో ప్రతి కార్యాలయంలో బాక్సులు ఏర్పాటుచేసి, అర్జీల్ని వాటిలో వేసి వెళ్లమనేవారు. కొన్ని జిల్లాల్లో జులై చివరి వారంలో, మరికొన్ని జిల్లాల్లో ఆగస్టు మొదటివారంలో ఈ కార్యక్రమం మళ్లీ మొదలైంది. ప్రస్తుతం అన్ని జిల్లాల్లో కలెక్టర్లే అర్జీలు తీసుకుంటున్నారు. సోమవారం ‘స్పందన’కు ప్రకాశం మినహా అన్ని జిల్లాల్లో కలెక్టర్లు హాజరయ్యారు. ప్రకాశం జిల్లా కలెక్టర్‌ టంగుటూరి ప్రకాశం పంతులు 150వ జయంత్యుత్సవ ఏర్పాట్లలో ఉండటంతో, సంయుక్త కలెక్టర్‌ ఆధ్వర్యంలో స్పందన కార్యక్రమం జరిగింది. ఉదయం 10.30 నుంచి అర్జీల స్వీకరణ ప్రారంభమై, మధ్యాహ్నం 2 గంటల వరకూ కొనసాగింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కలెక్టర్‌, అధికారులు ఆలస్యంగా రావడంతో 11.20కి ప్రారంభించారు. జిల్లా కేంద్రాల్లో కలెక్టర్లతో పాటు, జేసీలు, డీఆర్‌వో, వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు పాల్గొంటున్నారు. డివిజన్‌ కేంద్రాల్లో ఆర్డీవోల ఆధ్వర్యంలో స్పందన అంత సజావుగా లేదు. 90% ఆర్డీవో కార్యాలయాల్లో పదిలోపే దరఖాస్తులు వచ్చాయి. ఒక్కటీ రాని కార్యాలయాలూ ఉన్నాయి. కొన్నిచోట్ల తాగునీటికి ఇబ్బంది కలిగింది. దూరం నుంచి వచ్చేవారికి విజయనగరం కలెక్టరేట్‌ క్యాంటీన్‌లో రూ.10కి, పార్వతీపురం ఐటీడీఏలో ఉచితంగా భోజనం పెట్టేవారు. కరోనాతో అవి ఆగడంతో గిరిజనులు ఆకలితోనే వెనుదిరుగుతున్నారు. తూర్పుగోదావరి కలెక్టరేట్‌లో మధ్యాహం 2గంటలకే కార్యక్రమం ముగిసినా, రసీదు కోసం గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది.

డబ్బులివ్వలేదని... నేతన్న నేస్తం నిలిపేశారు

వీరంతా చేనేత కార్మికులు. కృష్ణాజిల్లా కైకలూరు మండలం వింజరం గ్రామం వీరిది. గత రెండు విడతలుగా నేతన్న నేస్తం పథకం లబ్ధి పొందారు. అర్హులు కారంటూ ఈ ఏడాదికి వీరికి పథకం వర్తింపజేయలేదు. గ్రామంలో 32 మంది అర్హులుండగా.... 9 మందికే సాయం మంజూరైందని.. తమకూ ఇవ్వాలంటూ మిగతా 23 మంది ఇప్పటికే రెండుసార్లు జిల్లా కలెక్టరేట్‌లో విన్నవించారు. ‘సచివాలయంలోని సంక్షేమ సహాయకుడు మాకు ఒక్కొక్కరికీ రూ.5 వేల చొప్పున అడిగారు. ఆ సొమ్ము ఇవ్వలేదని మా దరఖాస్తులు తిరస్కరించారు’ అని వారు వాపోయారు.

సాయం కోసం... తప్పని తిప్పలు
కార్యాలయాల చుట్టూ తిరగడానికి రూ.6 వేల ఖర్చు

విశాఖ జిల్లా గొలుగొండ మండలం కొత్తయల్లవరం గ్రామవాసి కన్నూరి రామకృష్ణ ఉపాధి కూలీగా పనిచేసి, ఆ డబ్బులు రాబట్టుకోవడానికి కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఆయన 19 వారాలు చేసిన పనికి కూలీ కింద రూ.22,500 చెల్లించాలి. సాంకేతిక సమస్యలను కారణంగా చూపి డబ్బులు ఇవ్వలేదు. మండల, డివిజన్‌ స్థాయిలో జరిగిన స్పందన కార్యక్రమాల్లో అనేకసార్లు వినతులిచ్చినా ఫలితం లేదు. కార్యాలయాల చుట్టూ తిరగడానికి ఇప్పటికే రూ.6 వేలు ఖర్చు చేశానని... అయినా తనకు న్యాయం జరగలేదని బాధితుడు తెలిపారు.

*‘నా భర్త సుబ్బారాయుడు ఈ ఏడాది మార్చి 9న అనారోగ్యంతో మరణించారు. మరణ ధ్రువీకరణ పత్రం కోసం తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకున్నా. ఇప్పటికీ మంజూరు కాలేదు. తహసీల్దార్‌ను అడిగితే అధికార పార్టీ నాయకులు ఎవరైనా సిఫార్సు చేస్తే ఇస్తామని చెబుతున్నారు. రాజంపేట ఆర్డీవోకు ఇప్పటికే రెండుసార్లు అర్జీ పెట్టుకున్నా. అయినా ఫలితం దక్కలేదు’ అని కడప జిల్లా పుల్లంపేట మండలం తిప్పాయిపల్లికి చెందిన ఈశ్వరమ్మ వాపోయారు.

వారికి ఓటెయ్యలేదని విద్యుత్తు మీటరు ఇవ్వట్లేదు

మ ఇంటికి విద్యుత్తు మీటరు అమర్చాలని ఏడాది కాలంగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదంటూ వనుం దుర్గాప్రసాద్‌ వాపోయారు. ఆయనది తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం పండ్రువాడ. స్థానిక ఎన్నికల్లో వైకాపాకు ఓటేయలేదనే కారణంతో తన నివాసానికి మీటరు అమర్చకుండా వారు అడ్డుకుంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

భూమిచ్చి... పరిహారం కోసం ఎనిమిదేళ్లుగా తిరుగుతున్నా

క్కవాగు విస్తరణ, కట్టల బలోపేతం కోసం 2006లో నా 2.39 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. అవార్డు చేసే క్రమంలో జాబితాలో నా పేరు తప్పిపోయింది. పరిహారం కోసం అప్పటి నుంచి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా. పరిహారం కింద రూ.60 లక్షలు రావాలి. ఎనిమిదేళ్లుగా తిరుగుతున్నా సమస్య పరిష్కారం కావట్లేదు. - పోపూరి గోపి బసవేశ్వరరావు, జాలాది, యడ్లపాడు, గుంటూరు జిల్లా

అయిదుసార్లు అర్జీ ఇచ్చినా ఫలితం లేదు

మా గ్రామంలో నాకు 3.46 ఎకరాల డీకేటీ భూమి ఉంది. అందులో సాగు చేస్తున్నా. నా వద్ద అన్ని పత్రాలూ ఉన్నా, ఆ భూమిని మా గ్రామానికి చెందిన భారతి పేరిట అధికారులు మార్చేశారు. ఇదేమని ప్రశ్నిస్తే వేరేచోట భూమి ఇస్తామంటున్నారు. కలెక్టరేట్‌లో అయిదుసార్లు అర్జీలు సమర్పించినా మారలేదు. - దుద్యాల వరలక్ష్మి, పెద్దహరిజనవాడ, వీరబల్లి మండలం

దారి సమస్య తీర్చట్లేదు

సుమారు 40 ఏళ్లుగా తెలుగుగంగ కాల్వ నుంచి పంట పొలాలకు దారి ఉంది. కొందరు నాయకులు అధికారులతో కుమ్మక్కై రోడ్డు మూసేశారు. ఆ కాల్వ వద్దకు వెళ్లాలంటే చుట్టూ తిరిగి వెళ్లాల్సి ఉంది. అక్కడ పంట పొలాలున్న వారంతా ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య పరిష్కారం కోరుతూ స్పందనలో మూడుసార్లు అర్జీలు ఇచ్చినా ఫలితం లేదు. -శ్రీనివాసులనాయుడు, కమ్మవారిపాలెం, పోరుమామిళ్ల మండలం

తొమ్మిదిసార్లు విన్నవించా

తిత్లీ తుపాను సమయంలో నా ఇల్లు కూలిపోయింది. కొత్త ఇంటి కోసం సచివాలయంలో తొమ్మిదిసార్లు దరఖాస్తు చేశా. అయినా పరిష్కారం కాలేదు. నాలుగు వారాల కిందట ఓ సారి సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో అర్జీ పెట్టా. 15 రోజుల్లో పరిష్కరిస్తామన్నారు. ఇప్పటికీ పరిష్కారం కాలేదు. -పట్నాన కామేశ్వరరావు, కూర్మనాథపురం, టెక్కలి

ప్రభుత్వ పథకాలు అందట్లేదని...

*‘రోడ్డు ప్రమాదంలో కాలు కోల్పోయాను. పింఛను మంజూరు చేయాలని నాలుగు వారాలుగా స్పందనకు వస్తున్నాను. అయినా ఫలితం లేదు’ అని అనంతపురం జిల్లా బెలుగుప్పకు చెందిన చెన్నప్ప వాపోయారు. ‘శాశ్వత వైకల్యం ఉన్న నాకు గతంలో రూ.5 వేలు పింఛను వచ్చేది. దాన్ని పూర్తిగా తొలగించారు’ అని కనగానపల్లెకు చెందిన పీటర్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

*‘నాకు 4.69 ఎకరాల భూమి ఉంది. కానీ 10.76 ఎకరాలు ఉన్నట్లు ఆన్‌లైన్‌లో చూపించడంతో ప్రభుత్వ పథకాలు రావట్లేదు. కోవెలకుంట్ల, పాణ్యం తహసీల్దార్‌లకు అనేకమార్లు అర్జీలు ఇచ్చినా పరిష్కారం కాలేదు’ అని కర్నూలు జిల్లా కోవెలకుంట్ల వాసి చంద్రశేఖర్‌రెడ్డి తెలిపారు.
*‘గతేడాది చేయూత పథకంలో నాకు లబ్ధి కలిగింది. ఈ ఏడాది అనర్హురాలినంటూ పథకం వర్తింపజేయలేదు. కారణం అడిగితే విద్యుత్తు బిల్లు ఎక్కువ వస్తోందని చెప్పారు. తొమ్మిది నెలల్లో ఎప్పుడూ 60 యూనిట్లకు మించి మేము వాడలేదు. సచివాలయంలోనూ, ఎంపీడీవోకూ విన్నవించినా న్యాయం జరగలేదు’ అని శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలానికి చెందిన పెరుమాల జ్యోతి వాపోయారు.

వితంతు పింఛను నిలిపేశారు

నిమిదేళ్లుగా అందుతున్న వితంతు పింఛను కారణం లేకుండా నిలిపేశారంటూ వాపోతున్న ఈమె పేరు చిటికన లక్ష్మి. రాజమహేంద్రవరం గ్రామీణ మండలం కొంతమూరు వాసి. ఈమె భర్త అనారోగ్యంతో మృతిచెందారు. అప్పటి నుంచి వితంతు పింఛను అందుతోంది. అయితే ఎలాంటి కారణం లేకుండా మూడు నెలలుగా ఆ పింఛను ఆపేశారు. దాన్ని పునరుద్ధరించుకునేందుకు ఆమె కొంత డబ్బులు ఖర్చు చేసినా ఫలితం లేకపోవటంతో కలెక్టరేట్‌లో అర్జీ సమర్పించేందుకు వచ్చారు.

భూముల సమస్యలతో కాళ్లరిగేలా తిరుగుతున్నా...

రసింగు సత్యానిది ప్రకాశం జిల్లా పామూరు మండలం. బొట్లగూడూరులోని సర్వే నంబరు 677/8ఏ లో ఆయనకు నాలుగెకరాల భూమి ఉంది. కానీ ఆన్‌లైన్‌లో ఆ భూమి 677/8డీ లో ఉన్నట్లు నమోదైంది. దాన్ని సరిచేయాలని రెండేళ్లుగా ఆయన తహసీల్దార్‌ కార్యాలయం మొదలు కలెక్టరేట్‌ వరకూ తిరుగుతూనే ఉన్నా సమస్య పరిష్కారం కాలేదు.

20 సార్లు స్పందనలో వేడుకున్నా..

కృష్ణా జిల్లా మొవ్వ మండలం నిడుమోలుకు చెందిన కె.ధర్మారావు, నాగేశ్వరరావు మాజీ సైనికులు. వీరికి ప్రభుత్వం భూమి ఇచ్చినా, పట్టాదారు పాసుపుస్తకాలు రాలేదు. వాటికోసం ఇప్పటికి 20 సార్లు స్పందనలో అర్జీలు ఇచ్చినా ఫలితం లేదు. ‘గత కలెక్టర్‌ సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చి ఆర్డీవోకు బాధ్యత అప్పగించారు. వెంటనే పాసుపుస్తకాలు ఇవ్వాలని ఆయన తహసీల్దార్‌ను ఆదేశించారు. మమ్మల్ని తహసీల్దార్‌ 4 నెలలు తిప్పించుకుని తర్వాత పట్టించుకోలేదు. అన్ని పత్రాలూ ఉన్నా మాకు న్యాయం జరగట్లేదు. మా స్థలంలో వేరొకరు షెడ్డు వేశారు. మాకు న్యాయం కావాలి’ అని వారు కోరారు.

భూమి ఆక్రమణలు అడ్డుకోవాలని కోరినా...

మ భూమిలో ఆక్రమణల్ని అడ్డుకోవాలంటూ మూడుసార్లు విన్నవించినా న్యాయం జరగట్లేదని వాపోతున్న ఈమె పేరు శ్రావణి. చిత్తూరు జిల్లా ఎస్‌ఆర్‌పురం మండలం పిల్లిగుండ్లపల్లె వాసి. ‘నా తండ్రి ఆంజనేయులనాయుడికి కటికపల్లిలో 1.24 ఎకరాల భూమి ఉంది. ఆయన ఆసుపత్రిలో చేరగా, కొందరు ఆయన భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించారు. ఆయన కోలుకున్న తర్వాత పొలంలో వేరుశెనగ విత్తేందుకు వెళ్లగా అడ్డుకున్నారు. భూ దస్త్రాలన్నీ మా పేరిటే ఉన్నాయి. న్యాయం చేయాలని కోరినా ఫలితం లేదు’ అని ఆమె వాపోయారు.

*విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురం మండలం తంతడికి చెందిన భూముల్ని భాభా అణు పరిశోధన కేంద్రం (బార్క్‌) నిర్మాణం కోసం గతంలో సేకరించారు. ఈ భూముల్లో సాగుదారులను సక్రమంగా గుర్తించలేదని బాధితులు గతేడాదిగా కలెక్టరేట్‌ చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికి నాలుగు సార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు.

*‘నా తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఆస్తి పత్రాలన్నీ సమర్పించినా పాస్‌ పుస్తకాలు ఇవ్వకుండా, ఆన్‌లైన్‌లో పేరు నమోదు చేయకుండా మూడేళ్లుగా అధికారులు తిప్పిస్తున్నారు’ అని గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం మెరికపూడి వాసి షేక్‌ ఖాజావలీ ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రధానంగా వచ్చిన సమస్యలివీ..

*పింఛన్లు రాకపోవడం, మ్యుటేషన్లు జరగకపోవడం, ఆస్తి, సరిహద్దు తగాదాలు, పాస్‌బుక్‌లు రాకపోవడం, భూముల సర్వే చేయకపోవడం వంటి సమస్యలతో ఎక్కువగా వస్తున్నారు.

*రెవెన్యూ, పౌర సరఫరాలు, పోలీసు, పురపాలక, వ్యవసాయ శాఖల సమస్యలపై ఎక్కువ మంది అర్జీలు పెట్టుకున్నారు.

*తమ వివరాలు తప్పుగా నమోదు చేయడం వల్ల పింఛన్లు రద్దయ్యాయని, ఆధారాలతో గ్రామ సచివాలయాల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా సరిచేయడం లేదని ఎక్కువ మంది ఫిర్యాదు చేశారు.

*రేషన్‌ కార్డులు, ఇళ్ల పట్టాల లాంటి అవసరాల కోసం కూడా పలువురు దరఖాస్తులు అందజేశారు.

*అమ్మఒడి, చేయూత, నేతన్న నేస్తం వంటి పథకాలు అందలేదని ఎక్కువ మంది దరఖాస్తులు తీసుకొచ్చారు. గ్రామ సచివాలయాల్లో ఉండే సెక్రటరీలు, వెల్ఫేర్‌ అసిస్టెంట్లు కావాలనే తమకు పథకాలు అందకుండా చేశారని కొన్నిచోట్ల ఫిర్యాదు చేశారు.

ఇదీ చదవండి:విద్యార్థి మృతిపై ఆర్జేడీతో విచారణ జరుపుతున్నాం : మంత్రి సురేశ్‌

ABOUT THE AUTHOR

...view details