ఎవరైనా ప్రాణాపాయస్థితిలో ఉంటే.. 108కే ఫోన్ చేస్తారు. కానీ ఇప్పుడు ఆ 108 వాహన సిబ్బంది కుటుంబాలే దాదాపు అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. నెలల తరబడి వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 3 నెలలుగా జీతాలు రాక వారి కుటుంబ పోషణ భారంగా మారింది. ఇంటి అద్దెలు, కిరాణా ఖర్చులు, పిల్లల ఫీజులు కట్టలేక సతమతమవుతున్నారు. ఏ ఒక్కరిదో ఇద్దరిదో కాదు.. రాష్ట్రంలో 108, 104లో పనిచేస్తున్న సిబ్బంది అందరిదీ ఇదే దయనీయస్థితి.
రాష్ట్రవ్యాప్తంగా వెయ్యి 108 వాహనాలు ఉండగా.. వీటిల్లో 3 వేల మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారు. అలాగే 104 వాహనాలు 700 దాకా ఉంటాయి. వీటిలో మరో 2 వేల మంది సిబ్బంది ఉన్నారు. ప్రస్తుతం ఈ అంబులెన్సుల సేవలు.. అరబిందో సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తున్నాయి. వీరందరికీ 3 నెలలుగా వేతనాలు అందక...ఇంట్లో నిత్యావసరాల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి. జీతాల కోసం అడిగి విసిగిపోయిన సిబ్బంది ప్రభుత్వానికి సమ్మె నోటీసు ఇచ్చారు. రెండు, మూడు రోజులుగా నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేస్తూనే విధులు నిర్వర్తిస్తున్నారు. అరబిందో సంస్థ మాత్రం తమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు రాలేదని....అందుకే వేతనాలు ఇవ్వలేకపోతున్నామని చెప్పడం గమనార్హం.
వేతనాలు రాక అప్పు పుట్టక 108, 104 సిబ్బంది పడుతున్న బాధలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. క్రెడిట్ కార్డులు, రుణ యాప్‌ల నుంచి అధిక వడ్డీలకైనా సరే తప్పక అప్పులు తీసుకుంటూ రోజులు గడుపుతున్నారు. కుటుంబపోషణకు తంటాలు పడుతున్నారు. ఒక సంస్థ ఇచ్చిన అప్పును తీర్చడానికి మరో యాప్ నుంచి రుణం తీసుకుంటూ పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.