తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేసే ఉద్దేశం లేదని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ స్పష్టం చేశారు. రాజ్యసభలో ఈ నెల 12న తెరాస ఎంపీ సురేష్ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ఇప్పటికే తెలంగాణలో పసుపు ఎగుమతుల కార్యక్రమాలు ప్రోత్సహించడం, దిగుబడుల అంశాలపై రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయానికి... నిజామాబాద్‌లో రీజినల్ ఆఫీస్ కం ఎక్స్‌టెన్షన్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పసుపుతోపాటు సుగంధ ద్రవ్యాల ఎగుమతుల ప్రోత్సాహం కోసం పనిచేసే బోర్డుకు... హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మంలో కార్యాలయాలు ఉన్నట్లు తెలిపారు.
భారత్‌లో పదకొండున్నర లక్షల టన్నుల పసుపు ఉత్పత్తి అవుతుందని... ప్రపంచంలో 73 శాతం పసుపు భారత్ నుంచే వస్తుందని కేంద్రం తెలిపింది. దేశంలో అత్యధికంగా తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మధ్యప్రదేశ్, పశ్చిమబంగ సహా పలు రాష్ట్రాల్లో పసుపు పండుతోందని వివరించారు.