ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Iron Problems: పేదల ఇళ్లపై ఇనుము భారం.. చేతులెత్తేసిన స్టీలు కంపెనీలు - ఏపీ వార్తలు

పేదలకు ఇంటి నిర్మాణం మరింత భారం కానుంది. నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా... పాత ధరలకు స్టీలును అందించలేమని ఆయా సంస్థలు ప్రభుత్వానికి స్పష్టం చేశాయి. లబ్ధిదారుల నుంచి స్టీలుకు డిమాండ్‌ పెరుగుతుండటంతో.. అధికారులు కొత్తగా టెండర్లను ఆహ్వానించారు.

iron problems to poor
iron problems to poor

By

Published : Feb 19, 2022, 6:15 AM IST

నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల పథకం కింద చేపట్టే ఇళ్ల నిర్మాణాలకు సరఫరా చేసే స్టీలును పాత ధరలకే అందించలేమని కంపెనీలు గృహ నిర్మాణ సంస్థకు స్పష్టం చేశాయి. ప్రస్తుతం టన్ను స్టీలును రూ.62-64 వేలతో కంపెనీలు సరఫరా చేస్తున్నాయి. ఇదే ధరకు మరికొంత కాలం సరఫరా చేయాలని గృహ నిర్మాణ సంస్థ అధికారులు కంపెనీలకు విజ్ఞప్తి చేసినా అంగీకరించలేదు. కొన్ని జిల్లాల్లో గృహ నిర్మాణాలకు లబ్ధిదారుల నుంచి స్టీలుకు డిమాండ్‌ పెరుగుతుండటంతో అధికారులు మళ్లీ టెండర్లు పిలిచారు.

ఈ పథకం కింద ప్రభుత్వం మొదటి విడతగా 15.75 లక్షల ఇళ్ల నిర్మాణాలు చేపడుతోంది. పథకం ప్రారంభంలో ఏడాది కాలపరిమితితో టెండర్లు పిలిచి టన్ను రూ.56 వేలకు ధర ఖరారు చేసి లబ్ధిదారులకు సరఫరా చేశారు. గతేడాది అక్టోబర్‌ వరకు ఇదే ధర కొనసాగింది. ఆ తర్వాత ఏడాది గడువుతో సరఫరాకు కంపెనీలు ముందుకురాలేదు. దీంతో కాలపరిమితిని మూడు నెలలకు కుదించి మళ్లీ టెండర్లు పిలిచారు. టన్ను ధర రూ.56 వేల నుంచి రూ.62-64 వేలకు చేరింది. గతేడాది అక్టోబర్‌ నుంచి ఇప్పటివరకు ఇదే ధరతో సరఫరా చేశారు. బహిరంగ మార్కెట్‌లో స్టీలు ధర పెరగడంతో కంపెనీలు మరికొంతకాలం నిర్దేశిత ధరకు సరఫరాకు ముందుకు రాలేదు. దీంతో 2 రోజుల క్రితం టెండర్లు పిలిచారు.

ఈనెల 25న టెండర్లు ఓపెన్‌ చేయనున్నారు. అయితే టెండరు నిబంధనల్లో ఎక్కడా 3 నెలల గడువు పేర్కొనలేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం 9 కంపెనీలు రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల నిర్మాణాలకు స్టీలును సరఫరా చేస్తున్నాయి.

34 వేల టన్నుల సరఫరాకు టెండర్లు...

రాబోయే మూడు నెలల కాలంలో ఇళ్ల నిర్మాణాల పురోగతికి అనుగుణంగా జిల్లాల నుంచి స్టీలు ఇండెంట్‌ తెప్పించారు. 34 వేల టన్నుల స్టీలు అవసరం ఉన్నట్లు జిల్లా అధికారులు నివేదించారు. ఆ ప్రకారమే టెండర్లు పిలిచారు. పునాది దశలోనే స్టీలు వినియోగించాల్సి ఉన్నందున కోస్తా జిల్లాల నుంచే ఇండెంట్‌ ఎక్కువగా ఉంది. నెల్లూరు జిల్లాలో ఇప్పటికే పాత స్టాక్‌ పూర్తి కాగా మిగతా జిల్లాల్లో కొంతమేర ఉంది.

లబ్ధిదారునిపై రూ.2-3 వేల వరకు పెరిగిన భారం

ఇళ్ల నిర్మాణ పథకం ప్రారంభంలో లబ్ధిదారులకు టన్ను రూ.56 వేలతో స్టీలు అందించగా అది రూ.62-64వేలకు పెరగడంతో ఒక్కో లబ్ధిదారునిపై అదనంగా రూ.2 నుంచి 3 వేల(అర టన్నుకు) భారం పడింది. తాజాగా బహిరంగ మార్కెట్‌లో స్టీలు ధర మరింత పెరిగి రూ.70 వేలకు చేరినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ మేరకు కంపెనీలు అధిక ధరకు కోడ్‌ చేస్తే అది లబ్ధిదారులకు మరింత భారమయ్యే అవకాశముంది. కంపెనీలు ఏ మేరకు కోడ్‌ చేసినా సంప్రదింపులకు అవకాశం ఉంటుందని, ఆ మేరకు నిబంధనల్లోనే పేర్కొన్నామని అధికారులు చెబుతున్నారు.

ఇదీ చదవండి:

ఆయనది హోల్​సేల్ దోపిడీ అయితే.. వారిది చిల్లర దోపిడీ: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details