No Covid Deaths: 2020 మార్చ్ 2న రాష్ట్రంలో తొలిసారిగా కొవిడ్ కేసు నమోదైంది. అప్పటి నుంచి రెండు నెలల క్రితం వరకు మూడు దశల్లో మహమ్మారి పంజా విసిరింది. రాష్ట్రంలోని నాలుగు వేలమందికి పైగా ప్రాణాలను బలితీసుకుంది. ముఖ్యంగా రెండో వేవ్ తీవ్రతకు చిన్నా పెద్దా అంతా విలవిలలాడ్డారు. ఐతే ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగవుతున్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కరనా రెండో వేవ్‌తో పోలిస్తే మూడో వేవ్ తక్కువ ప్రభావం చూపటం సహా మరణాలు తక్కువగానే నమోదయ్యాయి.
తగ్గుముఖం...
ఇక ఇటీవల మహమ్మారి తీవ్రత మరింత తగ్గుముఖం పట్టింది. కరోనా పరీక్షల కోసం వచ్చే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోగా... పాజిటివిటీ రేట్ అదే స్థాయిలో పడిపోయింది. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 0.31 శాతం పాజిటివిటీ రేట్ నమోదవుతున్నట్టు వైద్యారోగ్యశాఖ లెక్కలు చెబుతున్నాయి. కనీసం 1 శాతం కంటే తక్కువగా పాజిటివిటీ రేట్ ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గతంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకటించింది.
వందలోపే...
ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 950 యాక్టివ్ కేసులు మాత్రమే ఉండగా... రోజుకి యాభై నుంచి వందలోపే కొవిడ్ కేసులు నమోదవుతున్నాయి. గతకొంత కాలంగా కొవిడ్ మరణాలు నమోదవ్వటం లేదు. గత నెల 24న ఆఖరిసారి రాష్ట్రంలో ఒకరు కరోనాతో మృతిచెందగా... మొత్తం కొవిడ్ మరణాల సంఖ్య 4,111కి చేరింది. అప్పటి నుంచి రాష్ట్రంలో మళ్లీ కొవిడ్ మరణాలు నమోదు కాలేదు. కరోనా వెలుగు చూసిన నాటి నుంచి కొవిడ్ మరణాలు ఇంత ఎక్కువకాలం నమోదుకాకపోవటం ఇదే తొలిసారి. రికవరీరేట్ 99.35కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 7లక్షల 90 వేల 351 మందికి వైరస్ సోకగా... ఇప్పటికే 7లక్షల 85 వేల 290 మంది కోలుకున్నట్టు వైద్యారోగ్యశాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో వారంరోజులుగా ఒక్క కొవిడ్ కేసు నమోదుకాకపోగా గద్వాల,ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, నారాయణపేట, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్ రూరల్ జిల్లాల్లో పది లోపే యాక్టివ్ కేసులు ఉండటం గమనార్హం.
అప్రమత్తత అవసరమే...
కొవిడ్ పాజిటివిటీ రేట్ తగ్గటం... రికవరీ రేట్ అత్యధికంగా ఉన్నందున రాష్ట్రంలో యాక్టివ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. ఐతే వైరస్ తీవ్రత తక్కువగా ఉన్నా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ సూచిస్తోంది. కొవిడ్ నిబంధనలు పాటించాల్సిన అవసరం ఇంకా ఉందని స్పష్టం చేస్తోంది.
ఇదీ చదవండి:
కల్తీసారా మృతుల కుటుంబాలతో పూర్తైన రహస్య విచారణ!