కరోనా వైరస్ తీవ్రతకు తగ్గస్థాయిలో రాష్ట్రంలో నిర్ధారణ పరీక్షలు జరగట్లేదు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 4 ప్రయోగశాలల్లో రోజుకు 450 నమూనాలే పరీక్షిస్తున్నారు. రాష్ట్రంలో విజయవాడ సిద్దార్థ, తిరుపతి స్విమ్స్, కాకినాడ, అనంతపురం బోధనాసుపత్రుల్లోని వైరాలజీ ప్రయోగశాలల్లో నమూనాలను పరీక్షిస్తున్నారు. గుంటూరు, కడప బోధనాసుపత్రుల్లో పరీక్షల ‘క్వాలిటీ టెస్టింగ్’ గురువారం జరిగింది. శుక్రవారం నుంచి వీటిలోనూ మొదలైతే రోజుకు 570 పరీక్షలు చేయొచ్చు. త్వరలో విశాఖ కేజీహెచ్‌కీ అనుమతి వస్తే.. రోజుకు 900-950 వరకు పరీక్షలను చేసే అవకాశం ఉంటుంది తప్ప అంతకుమించి సాధ్యం కాదు.
ఫలితానికి ఐదారు గంటలు
కాకినాడ రంగరాయ వైద్యకళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ బాబ్జీ మాట్లాడుతూ ‘మార్చి 18 నుంచి ఇక్కడ రోజుకు 120 నమూనాలు పరీక్షిస్తున్నాం. నిపుణుల ఆధ్వర్యంలో నిశితంగా చేయాల్సి ఉన్నందున సంఖ్య పెరగడం కష్టం’ అన్నారు. ప్రయోగశాల విభాగం అధిపతి డాక్టర్ సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ కేంద్రం నుంచి వచ్చే ఒక్కో కిట్ ద్వారా 400 మందికి పరీక్షలు చేయవచ్చునని తెలిపారు. పరీక్ష ప్రారంభించిన ఐదారు గంటలకు ఫలితాలు ఇస్తున్నామన్నారు. బయోసేఫ్టీ క్యాబిన్‌లో రియల్ టైమ్ పీసీఆర్ మిషన్ ద్వారా ఈ పరీక్షలు జరుగుతున్నాయి. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) అనుమతి పొందిన ప్రయోగశాలల్లోనే పరీక్షలు జరగాల్సి ఉండటంతో ఫలితాలు ఆలస్యమవుతున్నాయి. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో కొన్ని ప్రైవేటు ల్యాబులకు అనుమతులిచ్చినా, ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్ లేదు.