విద్యార్థులకు వర్క్‌షీట్లు ఇవ్వాలని భావిస్తున్న విద్యాశాఖ పాఠ్యపుస్తకాల పంపిణీపై మాత్రం దృష్టి సారించడం లేదు. పాఠ్యపుస్తకాలు ఉంటే.. చదువుకున్న తల్లిదండ్రులు విద్యార్థులకు బోధించే సదుపాయం ఉంటుంది. ఉపాధ్యాయులు విద్యార్థులకు ఆన్‌లైన్‌లోనే సందేహాలను నివృత్తి చేసే అవకాశం ఉంటుంది. ఒకవైపు ప్రైవేటులో పాఠ్యపుస్తకాలు, ఆన్‌లైన్ పాఠాలు బోధన సాగుతుండగా.. ప్రభుత్వ విద్యార్థులకు పుస్తకాల సరఫరాకు ఇంకా సమయం పట్టే పరిస్థితి కనిపిస్తోంది.
విద్యా కానుక కింద బ్యాగ్‌లు, బూట్లు, ఏకరూప దుస్తులు, బెల్టులతోపాటు కలిపి ఆగస్టు 15 తర్వాత అందించాలని భావిస్తున్నారు. దీంతో కొంత జాప్యం ఏర్పడుతోంది. ముద్రణ సంస్థల నుంచి జిల్లా కేంద్రాలకు దాదాపుగా అన్ని పుస్తకాలు సరఫరా చేశారు. అక్కడి నుంచి పాఠశాలల మండల విద్యాధికారుల కార్యాలయాలకు 75% వెళ్లాయి. ఇక్కడి నుంచి బడులకు చేరాల్సి ఉంటుంది.
మొత్తం 3.31 కోట్ల పుస్తకాలు
1-8 తరగతుల పాఠ్యపుస్తకాలను సెమిస్టర్ విధానంలో ముద్రించారు. 1-5 తరగతులకు మూడు సెమిస్టర్లుగా పుస్తకాలను ముద్రించగా.. 6, 7, 8 తరగతులకు రెండు సెమిస్టర్లుగా పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. 1-6 తరగతుల్లో అన్ని సబ్జెక్టులకు వర్క్‌బుక్స్ అందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3,31,39,341 పాఠ్య పుస్తకాలు అవసరం కానున్నాయి. వీటికి 10% అదనంగా ముద్రించారు. అధికారుల లెక్కల ప్రకారం జిల్లా కేంద్రాలకు అన్ని పుస్తకాలు చేరాయి.
ఇక్కడి నుంచి ఎంఈఓల కార్యాలయాలకు 75% చేరాయి. మిగతావి సరఫరా చేస్తున్నారు. ఉపాధ్యాయులు రోజువారీగా పాఠశాలలకు వెళ్తున్నారు. టీవీల్లో వచ్చే పాఠాలను విద్యార్థులు వింటున్నదీ లేనిదీ పర్యవేక్షించే బాధ్యత వారికి అప్పగించారు. వర్క్‌షీట్లను విద్యార్థులకు తల్లిదండ్రుల ద్వారా అందించనున్నట్లు ఇటీవల ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ సమయంలో పాఠ్యపుస్తకాలను అందిస్తే అభ్యసనకు ఉపయోగపడుతుందని విద్యావేత్తలు సూచిస్తున్నారు.
ఇదీ చదవండి:
నేనేం పాపం చేశానమ్మా!.. ఏ చెత్తకుప్పలో పడేసినా బతికి ఉండేదాన్ని!