నైపుణ్య విశ్వవిద్యాలయానికి డిసెంబరులో శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేయాలని అక్టోబరు 19న మంత్రి గౌతమ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కానీ ముందుకు సాగలేదు. మరో 4 నెలలు గడిస్తే ఉన్నత విద్య చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులు విద్యా సంస్థల నుంచి బయటకొస్తారు. వారికి నైపుణ్య శిక్షణ అందించాల్సి ఉంది. కానీ అవి ఇప్పుడప్పుడే ఏర్పాటయ్యేలా లేవు.
తిరుపతిలో నైపుణ్య విశ్వవిద్యాలయం ఏర్పాటుచేసి అనుబంధంగా ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో ఒక నైపుణ్య కళాశాల చొప్పున 25, 4 ట్రిపుల్‌ఐటీలు, పులివెందులతో కలిపి 30 కళాశాలలను ఏర్పాటు చేస్తామన్నారు. ఒక్కో కళాశాలకు 5 నుంచి 10 ఎకరాలుండాలనే నిబంధన ఉంది. బాపట్ల, అమలాపురం, కాకినాడ, తిరుపతి లోక్‌సభ పరిధిలోని వెంకటగిరిలో ఏర్పాటుచేసే కళాశాలలకు ఇంతవరకు స్థలాలనే ఎంపిక చేయలేదు. బాపట్లకు సంబంధించి వ్యవసాయ కళాశాలలో స్థల కేటాయింపునకు కసరత్తు చేస్తున్నారు.
అమలాపురం, కాకినాడల్లో స్థలాల పరిశీలన పూర్తి కాలేదు. వెంకటగిరిలో స్థలం తుది ఎంపిక చేయలేదు. విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఏర్పేడు వద్ద 50 ఎకరాలను కేటాయించారు. స్థలమున్నా పాలనా అనుమతులు లేనందున అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఒక్కో కళాశాల ఏర్పాటుకు రూ.40 కోట్లు అవసరమని అధికారుల అంచనా. 30 కళాశాలలకు రూ.1,200 కోట్లు అవసరమవుతాయి. ఇవి కాకుండా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు రూ.20 కోట్లను ప్రతిపాదించారు. ఎలాంటి శిక్షణ లేకుండా కేవలం పాలన, విధానపరమైన నిర్ణయాలకు వర్సిటీ పరిమితం కావాలని భావించారు.