ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ: ఉపఎన్నిక బరిలో సీఎం కుమార్తె.. ఎన్నిక లాంఛనమే! - bypolls in telangana news

తెలంగాణలోని నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు రీషెడ్యూల్ విడుదలైంది. అక్టోబర్ 9న పోలింగ్, 12న కౌటింగ్ జరగనుంది. గత ఏప్రిల్​లోనే ఎన్నిక పూర్తి కావాల్సి ఉన్నా.. కరోనా కారణంగా వాయిదా పడింది. ఈసీ రీషెడ్యూల్ విడుదల చేయడం వల్ల జిల్లాలో రాజకీయ సందడి మొదలైంది. తెరాస తరఫున స్వయానా సీఎం కేసీఆర్ కూతురు కవిత బరిలో నిలవడంతో ఎన్నిక ప్రాధాన్యత సంతరించుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెరాస ఆధిపత్యం చాటి.. అధిక స్థానాలు గెలుచుకోవడంతో ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో గెలుపుపై దీమాతో ఉన్నారు. అయితే ప్రతిపక్షాలు తమ సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నాయి. కొవిడ్ నిబంధనల మధ్య ఉప ఎన్నిక జరగనుంది.

Nizamabad Local Authorities MLC Bypoll
Nizamabad Local Authorities MLC Bypoll

By

Published : Sep 27, 2020, 8:19 AM IST

తెలంగాణలోని నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఎన్నికల సంఘం రీషెడ్యూల్ విడుదల చేయడం వల్ల జిల్లాలో రాజకీయ సందడి నెలకొంది. గత కొద్దిరోజులుగా రీషెడ్యూల్ వస్తుందని భావించిన పార్టీలు.. ఇప్పటికే కసరత్తు ప్రారంభించాయి. అక్టోబర్ 9న పోలింగ్ జరగనుండగా.. 12న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఉపఎన్నిక నిర్వహణకు గత మార్చి 12న నోటిఫికేషన్‌ జారీ అయ్యింది. అదే నెల 19న నామినేషన్లు ముగిశాయి. నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ పూర్తి చేసుకొని.. ఏప్రిల్‌ 7న పోలింగ్‌ జరగాల్సిన సమయంలో కరోనా నేపథ్యంలో రెండు సార్లు వాయిదా పడింది. ఇప్పుడు మళ్లీ తిరిగి ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే రాజకీయ పార్టీల ప్రతినిధులు, అభ్యర్థుల ఏజెంట్లతో ఎన్నికల నియమావళి మీద ఎన్నికల అధికారులు సమావేశం నిర్వహించారు. కరోనా నిబంధనల నడుమ ప్రచారం, సభలు, సమావేశాలు నిర్వహించాలని స్పష్టం చేశారు. ఉల్లంఘిస్తే కేసులు తప్పవని ఇప్పటికే ఎన్నికల అధికారులు హెచ్చరించారు.

బరిలో కల్వకుంట కవిత

స్థానిక సంస్థల శాసన మండలి స్థానం ఉపఎన్నికలో తెరాస నుంచి కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత, కాంగ్రెస్ నుంచి వడ్డేపల్లి సుభాష్‌రెడ్డి, భాజపా నుంచి పొతంకర్‌ లక్ష్మీనారాయణ పోటీ చేస్తున్నారు. 2014లో ఎంపీగా గెలిచి.. గత పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోయిన కవిత ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో నిలవడం వల్ల ఉప ఎన్నిక ప్రాధాన్యత సంతరించుకుంది. తెరాసలో ఉండి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న భూపతిరెడ్డి పదవీ కాలం 2022 జనవరి 4 వరకు ఉంది. అయితే గత శాసనసభ ఎన్నికల్లో హస్తం గుర్తుపై నిజామాబాద్‌ గ్రామీణ నియోజకవర్గంలో పోటీ చేసి ఓడిపోయారు. పార్టీ మార్పుపై తెరాస ఫిర్యాదు చేయటంతో 2019 జనవరి 16న అనర్హత వేటు పడింది. దీంతో ఉపఎన్నిక అనివార్యమైంది.

ఓటు వేయనున్న 824 మంది..

ఈ ఎన్నికల్లో 824 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం స్థానిక సంస్థల నుంచి ఎన్నికైన వారు ఓటింగ్‌లో పాల్గొంటారు. జడ్పీటీసీలు, ఎంపీటీసీ సభ్యులు, పుర కౌన్సిలర్లు, నగరపాలక సంస్థ కార్పొరేటర్లు ఓటు వేయనున్నారు. నిజామాబాద్ నుంచి సిరిసిల్ల జిల్లాలో కలిసిన మానాల మండలంలోని ఇద్దరు ఎంపీటీసీ సభ్యులూ ఇక్కడే ఓటు వేయాల్సి ఉంటుంది. సంఖ్యా పరంగా చూస్తే తెరాస బలంగా కనిపిస్తోంది. కాంగ్రెస్‌, భాజపా, స్వతంత్రులుగా గెలిచిన వారు పలువురు ఇప్పటికే గులాబీ కండువా కప్పుకున్నారు. బోధన్‌ మున్సిపాలిటీలో ఒకరు, నాగిరెడ్డిపేట ఎంపీటీసీగా గెలిచిన ఎంపీపీ మృతి చెందడం వల్ల ఆ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఎక్స్‌ అఫీషియో సభ్యులుగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కలిగి ఉంటారు. ఓటరు జాబితా ముందే తయారు కావడంతో ఇటీవల రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన సురేష్‌రెడ్డికి ఓటు హక్కు లేకుండా పోయింది. జహీరాబాద్‌ ఎంపీ మెదక్‌ జిల్లాలో ఎక్స్‌అఫీషియోగా ఉండటం వల్ల ఓటు వేసే అవకాశం లేదు.

గెలుపుపై తెరాస దీమా..

ఉప ఎన్నికలో గెలుపుపై తెరాస దీమాతో ఉంది. స్థానిక సంస్థల సభ్యులతోపాటు ఎక్స్ అఫీషియో సభ్యులు కూడా తెరాసకే అధికంగా ఉన్నారు. దీంతో గెలుపు లాంఛనంగానే భావిస్తున్నారు. అయితే గత పార్లమెంటు ఎన్నికల్లోనూ ఇదే దీమాతో ఉన్నా.. ఆ పార్టీ అభ్యర్థి కవితకు ఓటమి తప్పలేదు. ఇప్పుడు మరోసారి కవిత బరిలో నిలవడం వల్ల ఉదాసీనతకు తావులేకుండా జాగ్రత్త పడుతున్నారు. క్యాంపులు ఏర్పాటు చేసి ఓటర్లను తరలించేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్, భాజపాలు కూడా పోటీనిచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.

ఉపఎన్నికతో రాజకీయ సందడి

ఇన్నాళ్లూ కరోనా కారణంగా రాజకీయంగా నిశ్శబ్ధం ఆవహించింది. ఉపఎన్నిక రావడంతో మళ్లీ జిల్లాలో రాజకీయ సందడి కనిపిస్తోంది.

ఇవీ చూడండి:

బతుకుతెరువుకోసం వలస వచ్చారు.. ప్రత్యేకత చాటుకుంటున్నారు!

ABOUT THE AUTHOR

...view details