MARESOLE: సముద్ర జలాలపై పేరుకుపోయే చమురు తెట్టులను తొలగించేందుకు శాస్త్రవేత్తలు సరికొత్త పరిజ్ఞానాన్ని కనుగొన్నారు. పెట్రోలియం ఉత్పత్తులను తినే సూక్ష్మజీవులను గుర్తించారు. దీంతో కాలుష్యకారక ఇంధనాలు వాటి హానికారక, విషపూరిత లక్షణాలను కోల్పోయి సాధారణ ద్రవాలుగా మారుతాయి. సముద్ర జీవులపై పరిశోధనలు చేసే చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ(ఎన్.ఐ.ఒ.టి.) శాస్త్రవేత్తలు నాలుగేళ్లుగా పరిశోధనలు చేసి ఈ విషయాన్ని గుర్తించారు. సముద్ర అంతర్భాగాలకు చేరుకొనే ఎలాంటి హైడ్రోకార్బన్లను అయినా హానికారకం కాకుండా చేయవచ్చని కనుగొన్నారు. దీనికి ‘మరేసోల్ బయో రెమిడియేషన్’గా నామకరణం చేశారు.
‘మరేసోల్’ ప్రత్యేకతలివే..
* సముద్రాల్లో లీకయ్యే ముడిచమురును ఈ పరిజ్ఞానం ఉపయోగించి సమర్థంగా తొలగించవచ్చు.
* సూక్ష్మజీవులను పొడి రూపంలో ఉంచుతారు. ఈ పొడిని ఉప్పు నీటిలో వేసిన వెంటనే అందులోని సూక్ష్మజీవులు ప్రభావం చూపడం ప్రారంభిస్తాయి.
* టన్ను పెట్రోలియం ఉత్పత్తులను కిలో పొడితో సుమారు 60 రోజుల వ్యవధిలో హానిరహితంగా మార్చవచ్చు.
* ఈ సూక్ష్మజీవులకు పెట్రోలియం ఉత్పత్తులే ఆహారం. అందువల్ల పెట్రో ఉత్పత్తులను తినేసిన తరువాత ఆహారం దొరక్క చనిపోతాయి. అందువల్ల తరువాత రోజుల్లో వీటితో ఎలాంటి ప్రమాదం తలెత్తే అవకాశం ఉండదు.