రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) నియామకానికి ముగ్గురు సభ్యులతో కొలీజియం ఏర్పాటు చేయాలని ఎస్‌ఈసీగా బుధవారం పదవీవిరమణ చేసిన నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ సూచించారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన సంపూర్ణ అధికారాలు రాష్ట్ర ఎన్నికల సంఘానికే ఉండాలని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలను స్వేచ్ఛగా, సజావుగా నిర్వహించేందుకు చేపట్టాల్సిన సంస్కరణలు, పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాల్లో చేయాల్సిన సవరణలపై సిఫారసులతో ఆయన 11 పేజీల నివేదికను రూపొందించారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలసి నివేదిక అందజేసేందుకు అనుమతి కోరానని, ఆయన కొవిడ్ టీకా వేయించుకుంటున్నందున తర్వాత కలుద్దామని చెప్పినట్టు వర్తమానం అందిందని రమేశ్‌కుమార్ పేర్కొన్నారు. ముసాయిదా నివేదికను విలేకర్ల సమావేశంలో విడుదల చేశారు. దానిలో ముఖ్యాంశాలివీ..
చట్టసవరణ ద్వారా చేయాల్సిన మార్పులు
*చట్టసభలకు మాదిరిగానే స్థానిక సంస్థలకూ నిర్దేశిత గడువులోగా ఎన్నికలు జరగాలి. ప్రస్తుత పాలకమండళ్ల గడువు ముగియడానికి ముందే ఎన్నికల ప్రక్రియ పూర్తవ్వాలి.
* ప్రకృతి విపత్తులు, ఆరోగ్య అత్యవసర పరిస్థితులు వంటివి ఎదురైనప్పుడు.. గడువులోగా ఎన్నికలు నిర్వహించలేకపోతే ఎన్నికల సంఘం అనుమతి మేరకే ప్రభుత్వం పర్సన్ ఇన్‌ఛార్జులను నియమించాలి. తర్వాత ఆరు నెలల్లోగా ఎన్నికలు జరపాలి.
* రిజర్వేషన్లను ఖరారు చేసే అధికారాన్ని ఎన్నికల సంఘానికే ఇవ్వాలి. ఓటర్ల జాబితాల తయారీ, వార్డుల విభజన ప్రక్రియను కూడా ఎస్‌ఈసీకే అప్పగించాలి.
* పట్టణ ప్రాంతాల్లో చుట్టుపక్కలున్న పంచాయతీల విలీనం, సరిహద్దుల మార్పు.. ఎన్నికల నోటిఫికేషన్ ప్రక్రియ ప్రారంభమవడానికి ఆర్నెల్ల ముందే పూర్తి చేయాలి.
* రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆర్థికంగా, సంస్థాగతంగా పూర్తి స్వయంప్రతిపత్తి, సంపూర్ణ అధికారాలు కల్పించాలి. స్వేచ్ఛగా, సజావుగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన సదుపాయాలు, వనరులను ప్రభుత్వం కల్పించాలి.
* రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకంపై గవర్నర్‌కు ఒక ప్యానల్‌ను సిఫార్సు చేసేందుకు ముగ్గురు సభ్యులతో కొలీజియం వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఆ కమిటీలో హైకోర్టు న్యాయమూర్తి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పదవీ విరమణ చేసినవారిలో ఒకర్ని సభ్యులుగా నియమించాలి.
* ఎన్నికల కమిషన్ ప్రతిష్ఠను దెబ్బతీసేలా సామాజిక మాధ్యమాల్లోనూ, ఇతరత్రా దుష్ప్రచారం జరగకుండా రక్షణ కల్పించాలి. కమిషన్‌పై ముఖ్యంగా ఎన్నికల సమయంలో చేసే దుష్ప్రచారాన్ని తీవ్రమైన నేరంగా పరిగణించేలా చట్టంలో మార్పులు తేవాలి.
* ఎవరైనా అభ్యర్థుల హక్కులకు భంగం కలిగాయని ఎన్నికల కమిషన్ విచారణలో తేలితే.. తగు న్యాయం చేసే అధికారాన్ని దానికే కల్పించాలి. నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, బలవంతపు ఉపసంహరణల నిరోధానికి ఇది తోడ్పడుతుంది.
* 15 రోజుల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తిచేసే ప్రస్తుత విధానంలో పారదర్శకత లోపిస్తోంది. 21 రోజుల పాత పద్ధతినే మళ్లీ తేవాలి.