హైదరాబాద్ ప్రజలు మాత్రమే కాదు విదేశీ అతిథులు సైతం హుస్సేన్ సాగరతీరంలో పడవపై షికారు చేసేందుకు ఇష్టపడతారు. సంజీవయ్య పార్క్‌లో సేద తీరేందుకు ఆసక్తి చూపుతారు. లక్షలాది మంది పర్యాటకులతో కళకళలాడే ఈ ప్రాంతాన్ని మరింత అందంగా మలిచేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. హుస్సేన్‌సాగర్ చుట్టూ నైట్‌బజార్‌లను ఏర్పాటు చేసేందుకు హెచ్‌ఎండీఏ సన్నాహాలు ప్రారంభించింది. కొత్తగా ప్రారంభించబోయే ఈ ప్రాజెక్టుకు టెండర్లను ఆహ్వానించినట్టు తెలంగాణ పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి, హెచ్‌ఎండీఏ కమిషనర్ అర్వింద్‌కుమార్ తెలిపారు. నగరంలోని పర్యాటకులు ఇష్టపడే ఈ ప్రాంతాన్ని మరింత అందంగా.. ఆకర్షణీయంగా రూపొందించబోతున్నారు. మంత్రి కేటీఆర్ సూచనల మేరకు నైట్‌బజార్ ఏర్పాటు వేగవంతం కానుంది.
నడుచుకుంటూ.. నచ్చినవి కొనేసేలా
సృజనాత్మకత.. ఆధునికతతో సరికొత్తగా నైట్‌బజార్‌ను తీర్చిదిద్దనున్నారు. పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది తలెత్తని విధంగా జాగ్రత్తలు తీసుకోనున్నారు. హుస్సేన్‌సాగర్ చుట్టూ సరదాగా నడచుకుంటూ నచ్చిన వస్తువులు కొనుగోలు చేసేలా దుకాణాలను నిర్మించనున్నారు. ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యం(పీపీఈ)తో రూపుదిద్దుకుంటున్న ప్రాజెక్టును సొంతం చేసుకున్న ఏజెన్సీకి పదేళ్లపాటు నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తారు. ఆ తరువాత వారి ఆసక్తికి అనుగుణంగా మరో ఐదేళ్ల వరకూ అనుమతి(లైసెన్స్) పొడిగించే అవకాశాలున్నాయి. ప్రాజెక్టులో భాగంగా నైట్‌బజార్‌లో సంజీవయ్యపార్క్ నుంచి బుద్ధభవన్ వరకూ 1500 మీటర్ల విస్తీర్ణంలో దుకాణ సముదాయాలను సురక్షితంగా, ఆకర్షణీయంగా ఉండేలా నిర్మించనున్నాను. సుమారు 150-200 వరకూ పలు దుకాణాలను అందుబాటులోకి తేనున్నారు.