ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలుగు రాష్ట్రాల్లోని పౌరహక్కుల నేతల ఇళ్లలో ఎన్‌ఐఏ సోదాలు

రెండు తెలుగు రాష్ట్రాల్లోని పౌరహక్కుల సంఘం, విరసం నాయకుల ఇళ్లలో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. పత్రాలు, హార్డ్‌డిస్క్‌లూ, కరపత్రాలు వంటివి స్వాధీనం చేసుకున్న అధికారులు.. పలువురికి నోటీసులు ఇచ్చారు. పలువురిని అరెస్ట్ చేసి ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక చర్యలపై ప్రచారం చేస్తున్నందుకే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ప్రజాసంఘాల నేతలు ఆక్షేపించారు.

nia raids in andhrapradesh
ఎన్ఐఏ సోదాలు

By

Published : Apr 1, 2021, 5:09 AM IST

Updated : Apr 1, 2021, 5:24 AM IST

రాష్ట్రంలోని పౌరహక్కుల సంఘం, విరసం నాయకుల ఇళ్లల్లో.. బుధవారం సాయంత్రం మొదలైన ఎన్​ఐఏ సోదాలు గురువారం వరకూ కొనసాగాయి. మావోయిస్టులకు సమాచారం చేరవేస్తున్నారని.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపడుతున్నారనే ఆరోపణలతో విశాఖ మన్యం ముంచంగిపుట్టు పోలిస్‌ స్టేషన్‌లో.. పాత్రికేయుడు పొంగి నాగన్నపై గతేడాది కేసు నమోదైంది. ఆ తరువాత ఈ కేసు ఎన్ఐఏకు బదిలీ అయింది. దీనికి సంబంధించి మార్చి 7న హైదరాబాద్‌ ఎన్ఐఏ అధికారులు కొత్తగా మరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇందులో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ఇన్‌ఛార్జి అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ ఆర్కే, కార్యదర్శి గాజర్ల రవి అలియాస్‌ గణేష్‌తో పాటు వివిధ ప్రజాసంఘాలకు చెందిన 84 మందిపై ఉపా, ఇతర చట్టాల కింద కేసులు నమోదు చేశారు.

తెలుగు రాష్ట్రాల్లోని పౌరహక్కుల నేతల ఇళ్లలో ఎన్‌ఐఏ సోదాలు

అరెస్ట్ చేసి కోర్టుకు...!

ఇందులో భాగంగా మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, ఆంధ్ర-ఒడిశా సరిహద్దు (ఏవోబీ) ఇన్‌ఛార్జి అక్కిరాజు హరగోపాల్‌ అలియాస్‌ ఆర్కే, కార్యదర్శి గాజర్ల రవి అలియాస్‌ గణేష్‌తోపాటు వివిధ ప్రజాసంఘాలకు చెందిన మొత్తం 64 మందిపై భారత శిక్షా స్మృతి (ఐపీసీ), చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా), ఆంధ్రప్రదేశ్‌ ప్రజా భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా హైదరాబాద్‌ సరూర్‌నగర్‌ పీ అండ్‌ టీ కాలనీలో పౌరహక్కుల సంఘం తెలంగాణ ఉపాధ్యక్షుడు, న్యాయవాది వి.రఘునాథ్‌, మెహిదీపట్నంలోని ప్రజానాట్య మండలి మాజీ కళాకారుడు డప్పు రమేష్‌, జవహర్‌నగర్‌లోని ప్రజా కళామండలి రాష్ట్ర అధ్యక్షులు జాన్‌, గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని ఆంధ్రప్రదేశ్‌ పౌరహక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్‌, కడప జిల్లా ప్రొద్దుటూరులోని విరసం రాష్ట్ర మాజీ కార్యదర్శి వరలక్ష్మి, కర్నూలు జిల్లాలోని విరసం నాయకులు పినాకపాణి, అరుణ్‌ (సోమశేఖర శర్మ)ల ఇళ్లలో సోదాలు జరిపారు. విశాఖపట్నం పిఠాపురంకాలనీ లోని న్యాయవాది కె.పద్మ, చినవాల్తేరులోని న్యాయవాది కె.ఎస్‌.చలం, రాజమండ్రిలో ఏపీసీఎల్‌సీ రాష్ట్ర అధ్యక్షుడు చిట్టిబాబు ఇళ్లలో సోదాలు నిర్వహించారు. వీరందరినీ అరెస్టు చేసి గురువారం న్యాయస్థానంలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

తెలంగాణ పౌర హక్కుల సంఘం ఉపాధ్యక్షుడు అరెస్ట్

హైదరాబాద్​లో పౌర హక్కుల సంఘం ఉపాధ్యక్షుడు రఘునాథ్‌ అరెస్టయ్యారు. పీఎన్టీ కాలనీలోని ఆయన ఇంట్లో రఘునాథ్​ను ఎన్​ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రఘునాథ్ కంప్యూటర్, ల్యాప్‌టాప్​ను అధికారులు పరిశీలించారు.

నోరు నొక్కేందుకే..

అసమానతలపై ప్రశ్నిస్తున్న ప్రజా సంఘాల నోరు నోక్కేందుకు ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయని తెలంగాణ పౌరహక్కుల సంఘం నాయకులు విమర్శించారు. ఈ మేరకు సంఘం అధ్యక్షులు గడ్డం లక్ష్మణ్‌, ప్రధాన కార్యదర్శి ఎన్‌.నారాయణరావులు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ అక్రమ సోదాలను ఖండిస్తున్నామని, కేసులు పెట్టి హక్కులు హరించేందుకు చేస్తున్న ప్రయత్నాలను అందరూ ఖండించాలన్నారు. ఈ సోదాలను విరసం సభ్యుడు మంచాల అచ్యుత సత్యనారాయణరావు ఖండించారు. భావప్రకటన స్వేచ్ఛను, మానవ హక్కులను అణచివేస్తూ సమాజంలో భయానక వాతావరణం సృష్టించడం అప్రజాస్వామికమన్నారు.

ఇదీ చదవండి

గవర్నర్‌కు ఎస్‌ఈసీ లేఖ బహిర్గతం: హైకోర్టులో విచారణ

Last Updated : Apr 1, 2021, 5:24 AM IST

ABOUT THE AUTHOR

...view details