16వ నెంబర్ జాతీయ రహదారి విస్తరణ పనులు దాదాపుగా కొలిక్కి వచ్చాయి. గతేడాది మొదటి దశ కరోనా ప్రభావం, భారీ వర్షాలు కారణంగా పనుల వేగం మందగించినా, ఎన్‌హెచ్‌ఏఐ, గుత్త సంస్థ లక్ష్మీ ఇన్‌ఫ్రాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ఈ ఏడాది ఆరంభం నుంచి కార్యాచరణ వేగవంతమైంది. మొత్తంగా హనుమాన్‌జంక్షన్ బైపాస్ మినహా, కలపర్రు నుంచి చిన్నఆవుటపల్లి వరకు ఎక్స్‌ప్రెస్ మార్గం అందుబాటులోకి వచ్చింది. దీంతో గత కొన్ని రోజులుగా వాహనాలన్నీ నేరుగా, జోరుగా ఈ రహదారిపై పరుగులు పెడుతున్నాయి.
తాజా పరిస్థితి
విస్తరణ పనులన్నీ ముగింపు దశకు చేరుకున్నాయి. కల్వర్టులు, అండర్ పాస్‌లు, సర్వీసు రహదారి నిర్మాణాలు ఎప్పుడోనే పూర్తయ్యాయి. ఎక్స్‌ప్రెస్ హైవేగా తీర్చిదిద్దేందుకు గతంలో ఉన్న నాలుగు వరసల రహదారిని, ఆరు వరసలుగా నిర్మించే కార్యాచరణ కూడా పూర్తయిపోయింది. ఎక్స్‌ప్రెస్ మార్గానికి, సర్వీసు రహదారికి సంబంధం లేకుండా నిర్మాణాలు, నిర్దేశిత ప్రణాళికకు అనుగుణంగా ఎంపిక చేసిన గ్రామాల వద్ద అనుసంధానం చేసే పనులు జరుగుతున్నాయి. రహదారిపై మార్కింగ్‌లు, సైన్ బోర్డుల ఏర్పాటు కూడా మొదలయ్యాయి. వీటితో పాటు బస్ షెల్టర్లు, శౌచాలయాల నిర్మాణం మాత్రం పూర్తి కావాల్సి ఉంది.
బైపాస్ పనుల్లో వేగం
భూ సేకరణ సమస్య పరిష్కారం కావడంతో 16వ జాతీయ రహదారిలో అంతర్భాంగా నిర్మిస్తున్న హనుమాన్‌జంక్షన్ బైపాస్ పనులు జోరుగా కొనసాగుతున్నాయి. మొత్తం 6.72 కి.మీ. మేర బైపాస్ వ్యాపించి ఉండగా, భూ వివాదం కారణంగా ఒక కి.మీ. మేర మాత్రమే పనులు జరగలేదు. కలెక్టర్, ఇతర అధికారుల జోక్యంతో భూ వివాదం పరిష్కారమై, గత మూడు నెలలుగా ఒక కి.మీ. పనులతో పాటు, మొత్తం బైపాస్ నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతోంది. రెండు నెలల లోపుగానే బైపాస్ మార్గం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే సూచనలు కన్పిస్తున్నాయి.
రెండు నెలల్లో పూర్తి
ఎక్స్‌ప్రెస్ మార్గం పనులు దాదాపుగా పూర్తయినట్లే. బైపాస్‌తో కలిపి ఇంకా 10 శాతం మేర మాత్రమే జరగాల్సి ఉంది. మరో రెండు నెలల్లో వీటిని పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నాం. కొవిడ్ రెండో దశ వలన కొంతమేర పనుల్లో వేగం తగ్గింది. వీలైనంత త్వరగానే మొత్తం 27.4 కి.మీ. మార్గాన్ని అందుబాటులోకి తెస్తాం. - రవికాంత్, పీఎం, లక్ష్మీ ఇన్‌ఫ్రా
దూసుకుపోతున్నాయి..