రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపొందించే పేరుతో క్షేత్రస్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఇకపై ఎలాంటి పనులు చేపట్టేందుకు వీల్లేదని జాతీయ హరిత ట్రైబ్యునల్ చెన్నై బెంచ్ తేల్చిచెప్పింది. కేంద్ర అటవీ, పర్యావరణ, వాతావరణ పరిస్థితుల శాఖ వద్ద ఆంధ్రప్రదేశ్ దాఖలు చేసిన పర్యావరణ అనుమతుల దరఖాస్తు పరిష్కరించే వరకు పనుల విషయంలో ముందడుగు వద్దని స్పష్టం చేసింది. ఇంతవరకు ఏపీ చేపట్టిన పనులు కేవలం డీపీఆర్ రూపొందించేందుకు నిర్దేశించిన ప్రమాణాల ప్రకారమే జరిగాయా లేక అంతకుమించి పనులు చేశారా అన్నది తేల్చేందుకు ఒక కమిటీని నియమిస్తున్నామని ప్రకటించింది. ఈ కమిటీ ఇచ్చే నివేదికను కేంద్ర అటవీ పర్యావరణశాఖ పరిశీలించి నాలుగు నెలల్లో నివేదిక సమర్పించాలని నిర్దేశించింది. ఈ కేసులో కోర్టు ధిక్కరణ, జాతీయ హరిత ట్రైబ్యునల్ చట్టం కింద జారీ చేసిన ఇంజక్షన్ ఉత్తర్వుల ధిక్కరణ ఫిర్యాదుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. రాయలసీమ ఎత్తిపోతల పనులను పర్యావరణ అనుమతులు లేకుండా చేపట్టారని, నిలిపివేయాలని తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ హరిత ట్రైబ్యునల్ చెన్నై బెంచ్‌లో కేసు వేశారు. ఈ కేసులో కోర్టు తీర్పులను, హరిత ట్రైబ్యునల్ ఆదేశాలను ఉల్లంఘించినందున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ గవినోళ్ల శ్రీనివాస్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనుబంధ పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ కె.రామకృష్ణన్, నిపుణులు డాక్టర్ సత్యపాల్ కొర్లపాటి శుక్రవారం వీడియో కాన్ఫరెన్సు విధానంలో ఈ తీర్పు వెలువరించారు. కేంద్ర ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కృష్ణా బోర్డు తదితరులు ఈ కేసుల్లో ప్రతివాదులుగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది వెంకట రమణి, న్యాయవాది దొంతిరెడ్డి మాధురి తమ వాదనలు వినిపించారు.
NGT: అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతలు చేపట్టవద్దు: ఎన్‌జీటీ తీర్పు - ap latest news
11:45 December 17
రాయలసీమ ఎత్తిపోతల నిర్మాణంపై ఎన్‌జీటీ తీర్పు
ట్రైబ్యునల్ తీర్పులోని ముఖ్యాంశాలివీ..
* రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టులో డీపీఆర్ తయారీకి అవసరమైన మేరే పనులు చేశారా.. అంతకుమించి పనులు చేశారా తేల్చేందుకు కేంద్ర అటవీ పర్యావరణ శాఖ విజయవాడ ప్రాంతీయ కార్యాలయం, జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, కేంద్ర జలసంఘంలోని ప్రాజెక్టుల డిజైన్ విభాగాల నుంచి ఒక్కో సీనియర్ అధికారితో కమిటీని నియమిస్తున్నాం. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా పని చేపట్టినట్లు తేలితే పర్యావరణానికి ఎంత హాని కలిగించారు? వారికి ఎంత జరిమానా విధించవచ్చో కూడా కమిటీ తేల్చిచెప్పాలి.
* ఈ కమిటీ క్షేత్రస్థాయిలో తనిఖీలు చేసి, అధ్యయనం జరిపి నివేదికను కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు సమర్పించాలి. 2006 పర్యావరణ మదింపు నోటిఫికేషన్‌కు, డీపీఆర్ రూపకల్పన మార్గదర్శకాలను అతిక్రమించి పనులు చేశారని ఆ శాఖ భావిస్తే చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఆంధ్రప్రదేశ్‌పై తగిన చర్యలు తీసుకోవాలి.
* ఈ ప్రాజెక్టుకు ముందస్తు పర్యావరణ అనుమతులు అవసరమా కాదా అన్నది కేంద్ర అటవీ పర్యావరణశాఖ తేల్చాలి. పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టకూడదనుకుంటే ఆ అనుమతుల విషయంలో చట్టప్రకారం ఎలా వ్యవహరించాలో ఆ మేరకు నిర్ణయం తీసుకోవాలి.
ఇదీ చదవండి: