ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

NGT: సీమ ఎత్తిపోతలపై కేంద్ర పర్యావరణ శాఖ, కృష్ణా బోర్డులకు ఎన్జీటీ ఆదేశం

రాయలసీమ ఎత్తిపోతలపై కేంద్ర పర్యావరణశాఖ నివేదిక సమర్పించకపోవడాన్ని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ తప్పుబట్టింది. కృష్ణానదీ యాజమాన్య బోర్డు తన నివేదికను మెయిల్‌లో పంపడంపైనా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈనెల 27 లోగా కేంద్ర పర్యావరణశాఖ, నింబధనల ప్రకారం నివేదికలు సమర్పించాలని ఆదేశించింది,

NGT
NGT

By

Published : Aug 17, 2021, 5:49 AM IST

రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులకు సంబంధించి..కేంద్ర పర్యావరణ శాఖ ఇప్పటివరకు నివేదిక సమర్పించకపోవడాన్ని చెన్నైలోని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) తప్పుబట్టింది. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) తమ నివేదికను మెయిల్‌లో పంపడంపై అసంతృప్తి వ్యక్తంచేసింది. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ, కేఆర్‌ఎంబీ..27వతేదీ లోపు నిబంధనల ప్రకారం ట్రైబ్యునల్‌లో నివేదికలు సమర్పించాలని ఆదేశించింది. ఈ నివేదికలపై అభ్యంతరాలుంటే దాఖలు చేయవచ్చని పిటిషనర్‌కు సూచించింది. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి గత ఏడాది అక్టోబరు 29న ఇచ్చిన ఉత్తర్వులను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందని, ఉల్లంఘనకు పాల్పడిన అధికారులతోపాటు ప్రైవేటు వ్యక్తులపై కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలంటూ జి.శ్రీనివాస్‌తోపాటు తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌లపై ఎన్జీటీ జ్యుడిషియల్‌ సభ్యులు జస్టిస్‌ కె.రామకృష్ణన్‌, ప్రత్యేక నిపుణుడు కె.సత్యగోపాల్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.

పిటిషనర్‌ తరఫున న్యాయవాది కె.శ్రవణ్‌కుమార్‌ వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం గత ఉత్తర్వులకు విరుద్ధంగా పనులు చేపట్టినట్లు కేఆర్‌ఎంబీ నివేదిక సమర్పించిందని, కానీ పనులు చేపట్టలేదంటూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తప్పుదోవపట్టిస్తున్నారని ట్రైబ్యునల్‌ దృష్టికి తెచ్చారు. తెలంగాణ తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ.. పనులను పూర్తిచేసే పనిలో ఏపీ ప్రభుత్వం ఉందన్నారు. అందుకోసం అక్కడ మోహరించిన యంత్రాల ఫొటోలను సమర్పించామని, వాటిని పరిశీలించాలని కోరారు. ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది వెంకటరమణి, న్యాయవాది దొంతిరెడ్డి మాధురిరెడ్డి, శ్రీనివాస్‌లు వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం డీపీఆర్‌ తయారీకి సంబంధించినవి మినహా ఇతరత్రా ఎలాంటి పనులు చేపట్టడంలేదని, జులై 7వతేదీ నుంచి చిన్నపని కూడా జరగలేదని తెలిపారు. దీనికి సంబంధించి కేఆర్‌ఎంబీ నివేదిక తమకు అందాల్సి ఉందని, వాదనలు వినిపించడానికి గడువు కావాలని కోరారు. వాదనలను విన్న ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వం సమర్పించిన ఫొటోలను రికార్డుల్లోకి తీసుకుంటున్నట్లు తెలిపింది.

శిక్షలు విధించడంపై ట్రైబ్యునల్‌కు ఉన్న పరిధి ఏమిటి?

కోర్టుధిక్కరణకు పాల్పడినట్టు నిర్ధారణైతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడానికి ట్రైబ్యునల్‌కున్న పరిధేమిటి? ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో తెలిపే తీర్పులను సమర్పించాలని ధర్మాసనంఇరుపక్షాలకు సూచించింది. ఈకేసుకు సంబంధించేగాక, ట్రైబ్యునల్‌ ఉత్తర్వులను ఉల్లంఘించినపుడు ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో తెలిపేలా ఆ తీర్పుల సమాచారం ఉండాలని నిర్దేశించింది.

ఇదీ చదవండి:

High Court on Amararaja: తనిఖీ నివేదికను కోర్టు ముందుంచండి

ABOUT THE AUTHOR

...view details