విశాఖ నగరంలో హానికారక స్టైరీన్ వాయు లీకేజీపై జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్జీటీ ఛైర్పర్సన్ జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయల్ నేతృత్వంలో విచారణ చేపట్టిన బెంచ్ ఈ ఘటనపై 5 గురు సభ్యులతో విచారణ కమిటీని నియమించింది. మే 18 నాటికి నివేదిక ఇవ్వాలని సూచించింది. వాయు లీకేజీ ఘటనకు ఎల్జీ పాలిమర్స్ సంస్థ బాధ్యత వహించాలని వ్యాఖ్యానించింది. ఈ ఘటనలో జరిగిన ప్రాణనష్టానికి, ప్రజల ఆరోగ్యం, పర్యావరణాలకు జరిగిన నష్టాన్ని బేరీజు వేసి.. ముందస్తుగా 50 కోట్ల మొత్తాన్ని జిల్లా కలెక్టర్కు జమ చేయాలని ట్రైబ్యునల్ ఆదేశాలిచ్చింది. కంపెనీ ఆర్థిక పరిస్థితి, జరిగిన నష్టాన్ని మదింపు చేసి పరిహారం ఎంత చెల్లించాలన్నది నిర్ణయిస్తామని చెప్పింది.
పూర్తి నిర్లక్ష్యం
విశాఖలో జరిగిన ఘటనపై ఎన్జీటీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందులో సంస్థ నిర్లక్ష్యం స్పష్టంగా ఉందని చెప్పింది. హానికారక రసాయనాలు నిల్వ, తయారీ, దిగుమతి నిబంధనలు -1989 ను సంస్థ పాటించలేదని చెప్పింది. "చట్టబద్ధమైన నిబంధనలు పాటించకుండా.. ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగించేలా వ్యవహరించిన ఈ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవలసి ఉందని" బెంచ్ అభిప్రాయపడింది. వీటిని పర్యవేక్షించాల్సిన వ్యవస్థలు, అనుమతులు ఇచ్చిన సంస్థలు కూడా ఇందుకు బాధ్యత వహించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణ జరిగే మే 18వ తేదీ నాటికి కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖతో పాటు, కేంద్ర, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండళ్లు, ఎల్జీ పాలిమర్స్, విశాఖ కలెక్టర్ తమ వివరణలు ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది.