రాయలసీమ ఎత్తిపోతలపై దాఖలైన ధిక్కరణ పిల్ మీద.. జాతీయ హరిత ట్రైబ్యునల్లో విచారణ జరిగింది. పనులు జరపొద్దని ఎన్జీటీ ఆదేశాలిచ్చినా ఉల్లంఘించారని గవినోళ్ల శ్రీనివాస్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ప్రాజెక్టు పనులు జరపడం లేదని.. కేవలం సమాయత్త పనులు, అధ్యయనాలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం..ఎన్జీటీకి నివేదించింది. పనులు జరగట్లేదన్న వివరాలతో అఫిడవిట్ వేయాలని ఏపీ ప్రభుత్వానికి ట్రైబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది.
మరోవైపు... ట్రైబ్యునల్ ఆదేశాలను సుప్రీంలో సవాలు చేశారా అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని.. ఎన్జీటీ ప్రశ్నించింది. తాము సవాలు చేయలేదని ఏపీ తరఫు న్యాయవాది వివరించారు. బాధ్యతాయుత ప్రభుత్వంగా నిబంధనలకు అనుగుణంగానే వెళ్తున్నట్టు స్పష్టం చేశారు. అనంతరం.. తదుపరి విచారణను జనవరి 18కి వాయిదా పడింది.