పోలవరం ముంపుపై ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మండిపడింది. కాఫర్‌డ్యాంతో ఏర్పడుతున్న ముంపు నివారణకు ఏం చర్యలు తీసుకుంటున్నారని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులను ప్రశ్నించింది. పర్యావరణ అనుమతులు లేకుండానే పురుషోత్తపట్నం, పట్టిసీమ ప్రాజెక్టులు చేపడుతున్నారని.. పోలవరం నిర్మాణంలో పర్యావరణ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ దాఖలైన పిటిషన్లను ఎన్జీటీ సోమవారం విచారించింది. ట్రైబ్యునల్ ఛైర్‌పర్సన్ జస్టిస్ ఆదర్శ్‌కుమార్ గోయల్, జస్టిస్ సుధీర్ అగర్వాల్, జస్టిస్ బ్రిజేష్‌సేథి, విషయ నిపుణుడు డాక్టర్ నగిన్ నందాలతో కూడిన ధర్మాసనం ఇరుపక్షాల వాదనలను తెలుసుకుంది.
లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకునేలా నిర్మిస్తున్న పోలవరం విషయంలో పర్యావరణ అంశాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది శ్రవణ్‌కుమార్ వివరించారు. భారీగా పర్యావరణ ఉల్లంఘనలు జరుగుతుంటే మీరేం చేస్తున్నారని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ), పర్యావరణ శాఖలను ధర్మాసనం ప్రశ్నించింది. నిబంధనలను ఉల్లంఘించకుండా చూసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని సీపీసీబీ తరఫు న్యాయవాది రాజ్‌కుమార్ తెలిపారు. పర్యావరణ అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టిన ఏ ఒక్క అధికారిపైనా చర్యలు తీసుకోకపోవడంపై ధర్మాసనం ఆగ్రహించింది. పర్యావరణ చట్టాలను ఉల్లంఘించడం సిగ్గుచేటని వ్యాఖ్యానించింది.
పోలవరం ముంపుతో ఇళ్లలోకి నీరు చేరుతోందని పిటిషన్‌దారులు సమర్పించిన చిత్రాలను చూస్తే అర్థమవుతోందని పేర్కొంది. జీవితకాలం కష్టపడి సంపాదించుకున్న సామగ్రి కళ్లముందే కొట్టుకుపోతుంటే ప్రజలు ఎంత వేదన అనుభవిస్తారో తెలియదా? అని ధర్మాసనం ప్రశ్నించింది. పురుషోత్తపట్నం, పట్టిసీమ నిర్మాణాల వల్ల పర్యావరణానికి ఎంత నష్టం వాటిల్లుతుందో లెక్కలు వేశారని, అనుమతులు తీసుకోకపోవడంపై ఎందుకు జరిమానా విధించలేదని ధర్మాసనం ప్రశ్నించింది. పర్యావరణ నష్టానికి సంబంధించి పురుషోత్తపట్నానికి రూ.2.40 కోట్లు, పట్టిసీమకు రూ.1.80 కోట్లు పరిహారం విధించారని, ప్రాజెక్టుల్లా కాకుండా పరిశ్రమల్లా వాటిని లెక్కించారని అసహనం వ్యక్తం చేసింది. ప్రభుత్వాలే అనుమతులు తీసుకోకుండా ప్రాజెక్టులు చేపడితే ఎలా అని నిలదీసింది.
తనిఖీలకు వెళ్లిన అధికారులు పూర్తిస్థాయి వాస్తవాలను నివేదికలో పొందుపర్చలేదని, కేసును త్వరగా మూసేయాలనే ఆత్రుతే సీపీసీబీ నివేదికలో కనిపిస్తోందని అభిప్రాయపడింది. పట్టిసీమ, పురుషోత్తపట్నంలకు సంబంధించి సరైన నివేదికలు లేకపోవడంపై ధర్మాసనం ప్రశ్నించింది. అంత చిన్న విషయాలపై తాము దృష్టి పెట్టలేదని ఏపీ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది వెంకటరమణి బదులివ్వగా.. పర్యావరణ అంశం చిన్నదా? అని ధర్మాసనం ప్రశ్నించింది. తన ఉద్దేశం అది కాదని, నిపుణుల కమిటీ సిఫార్సు మేరకు పర్యావరణ పరిహారం చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ మొత్తం డిపాజిట్ చేసేందుకు కొంత సమయం కావాలని విన్నవించారు. విచారణ పూర్తయిందని, ఏవైనా అభ్యంతరాలుంటే 2వారాల్లో తెలియజేయాలని న్యాయవాదులను ఆదేశించిన ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. సెప్టెంబరు 30లోపు తీర్పు వెల్లడిస్తామని ప్రకటించింది.
ఇదీ చదవండి:
''క్విట్ ఇండియా'తో వలసవాదంపై పోరు బలోపేతం'